రిపోర్టర్ అరెస్ట్.. వీఢీసీ సభ్యులను బెదిరించి రూ.20 వేలు వసూలు
ఆదిలాబాద్ జిల్లా, ఆగస్టు 26: తలమడుగు పోలీస్ స్టేషన్ పరిధిలోని కుచ్లాపూర్ గ్రామానికి చెందిన వీఢీసీ (VDC) సభ్యులను బెదిరించి డబ్బులు వసూలు చేసిన ఆరోపణలపై గతంలో రిపోర్టర్‌గా పనిచేసిన బట్టు నరేష్ (32)ను పోలీసులు అరెస్ట్ చేశారు. వీఢీసీ సభ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తానని, పత్రికల్లో కథనాలు రాస్తానని బెదిరించి రూ.20 వేల నగదు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఆదిలాబాద్ రూరల్ సీఐ రహీం పాషా తెలిపిన వివరాల ప్రకారం.. కుచ్లాపూర్ గ్రామానికి చెందిన తోట శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 2025 డిసెంబర్‌లో బట్టు నరేష్ కుచ్లాపూర్ గ్రామానికి వెళ్లి వీఢీసీ సభ్యుల నుంచి రూ.40 వేలు డిమాండ్ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. డబ్బులు ఇవ్వకపోతే వీఢీసీ సభ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తానని, పత్రికల్లో వ్యాసాలు రాస్తానని బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
బెదిరింపులకు భయపడిన వీఢీసీ సభ్యులు నిందితుడికి రూ.20 వేల నగదు చెల్లించినట్లు బాధితుడు పోలీసులకు తెలిపాడు. అనంతరం 2026 జనవరిలో వీఢీసీ సభ్యులపై క్రిమినల్ కేసు నమోదు కావడంతో, తాము ఇచ్చిన రూ.20 వేల నగదును తిరిగి ఇవ్వాలని నరేష్‌ను ప్రశ్నించినట్లు పేర్కొన్నారు. అయితే ఇప్పటికే కేసు నమోదైందని, ఇకపై ఎలాంటి కేసులు నమోదు కాకుండా తాను చూసుకుంటానని నరేష్ హామీ ఇచ్చినట్లు ఫిర్యాదులో వెల్లడించారు.
తప్పుడు హామీలతో డబ్బులు తీసుకుని తమను మోసం చేశాడని బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేశారు. ఈ మేరకు క్రైమ్ నంబర్ 184/2026 కింద BNS సెక్షన్ 308(2), 420 ప్రకారం తలమడుగు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ రాధిక దర్యాప్తు చేపట్టి నిందితుడు బట్టు నరేష్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
బాధితులు ఉంటే పోలీసులను ఆశ్రయించాలి
ఈ సందర్భంగా ఆదిలాబాద్ రూరల్ సీఐ రహీం పాషా మాట్లాడుతూ.. బెదిరింపులకు పాల్పడే వ్యక్తులను నమ్మి డబ్బులు ఇవ్వవద్దని ప్రజలకు సూచించారు. నిందితుడి ద్వారా ఇలాంటి మోసాలకు గురైన బాధితులు ఎవరైనా ఉంటే నిర్భయంగా జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని సంప్రదించాలని కోరారు. బాధితులకు పోలీసులు అండగా ఉంటూ చట్టపరంగా న్యాయం చేస్తారని తెలిపారు. చట్టాన్ని ఉల్లంఘించి మోసాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని, ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని సీఐ స్పష్టం చేశారు.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.
