నకిలీ ఫర్టిలైజర్ ఫ్రాంచైజీ పేరుతో మోసం.. ఐదుగురు అరెస్ట్

Published on

-Advertisement-

ఆదిలాబాద్, మన భారత్ ఆగస్టు 21: నకిలీ ఫర్టిలైజర్ ఫ్రాంచైజీ, ఆన్‌లైన్ లోన్ పేరుతో దేశవ్యాప్తంగా సైబర్ మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను ఆదిలాబాద్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. బీహార్‌కు చెందిన ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఐపీఎస్ తెలిపారు. ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు.

దేశవ్యాప్తంగా వందలాది ఫిర్యాదులు

నిందితులు దేశవ్యాప్తంగా సుమారు 500 సైబర్ నేరాలకు పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైందని ఎస్పీ తెలిపారు. ఇప్పటివరకు బాధితుల నుంచి సుమారు రూ.3.5 కోట్ల వరకు మోసపూరితంగా వసూలు చేసినట్లు గుర్తించామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలోనే ఈ ముఠాపై సుమారు 90 సైబర్ క్రైమ్ ఫిర్యాదులు నమోదైనట్లు వెల్లడించారు.

ఫ్రాంచైజీ పేరుతో వల

నేషనల్ ఫెర్టిలైజర్స్ పేరుతో నకిలీ వెబ్‌సైట్ రూపొందించి, ఫ్రాంచైజీ ఇస్తామని నిందితులు ప్రచారం చేసేవారని పోలీసులు తెలిపారు. ఆన్‌లైన్‌లో ఫ్రాంచైజీ కోసం దరఖాస్తు చేసుకునే వారి నుంచి ఆధార్, పాన్ కార్డు, ఫొటోలు, బ్యాంకు ఖాతా వివరాలు వంటి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించేవారు.

ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ఫీజు, లైసెన్స్ ఫీజు, సర్వీస్ ఛార్జీలు, ట్రేడ్ ట్రాన్స్‌ఫర్ ఫీజు తదితర పేర్లతో విడతలవారీగా డబ్బులు చెల్లించాలని బాధితులపై ఒత్తిడి చేసేవారు. బాధితులు నిందితులు సూచించిన బ్యాంకు ఖాతాలు, యూపీఐ, ఎన్‌ఈఎఫ్‌టీ మార్గాల్లో నగదు బదిలీ చేసిన అనంతరం వారి ఫోన్లు, వాట్సాప్ సందేశాలకు స్పందించకుండా మోసానికి పాల్పడేవారని తెలిపారు.

ఆదిలాబాద్ జిల్లాలో రూ.3.85 లక్షల మోసం

జైనథ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భోరాజ్ మండలం మాండగడ గ్రామానికి చెందిన అకునూరు గణేష్‌ను ఇదే తరహాలో మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. “National Fertilizers Pvt. Ltd.” పేరుతో నకిలీ ప్రకటన ద్వారా ఫ్రాంచైజీ ఇప్పిస్తామని నమ్మించి నిందితులు బాధితుడిని సంప్రదించారు.

మొదట రిజిస్ట్రేషన్ ఫీజు పేరుతో రూ.50 వేల చెల్లింపును తీసుకున్నారు. అనంతరం లైసెన్స్, ఫ్రాంచైజీ రిజిస్ట్రేషన్, ఇతర అదనపు ఛార్జీల పేరుతో పలుమార్లు డబ్బులు చెల్లించాలని కోరారు. దీంతో బాధితుడు వివిధ దశల్లో మొత్తం రూ.3,85,725ను బ్యాంకు ఖాతాలు, యూపీఐ, ఎన్‌ఈఎఫ్‌టీ ద్వారా బదిలీ చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం నిందితులు అందుబాటులో లేకపోవడంతో బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.

సాంకేతిక ఆధారాలతో నిందితుల గుర్తింపు

కేసును సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేసిన పోలీసులు మోసానికి పాల్పడిన నిందితులను గుర్తించారు. బీహార్ రాష్ట్రానికి చెందిన ఐదుగురిని అరెస్ట్ చేశారు.

అరెస్ట్ అయిన వారిలో అబిషేక్ కుమార్ అలియాస్ సౌరవ్ (24), ఆశుతోష్ కుమార్ అలియాస్ బబ్లూ (33), నిషు కుమార్ (25), రితేష్ కుమార్ (24), అభినాష్ కుమార్ (24) ఉన్నారు. వీరంతా బీహార్ రాష్ట్రంలోని నవాదా, నలందా జిల్లాలకు చెందినవారిగా పోలీసులు వెల్లడించారు.

10 మొబైల్ ఫోన్లు, రూ.70 వేల నగదు స్వాధీనం

నిందితుల వద్ద నుంచి 10 సెల్‌ఫోన్లు, రూ.70 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాధితుల నుంచి మోసపూరితంగా వసూలు చేసిన డబ్బులో సుమారు రూ.8 లక్షలను నిందితులు బ్యాంకు ఖాతాల్లో ఉంచడంతో పాటు స్టాక్ మార్కెట్ షేర్లలో పెట్టుబడులు పెట్టినట్లు దర్యాప్తులో గుర్తించారు. ఆ మొత్తాన్ని కూడా పోలీసులు జప్తు చేసినట్లు ఎస్పీ తెలిపారు.

ఆన్‌లైన్ ప్రకటనలపై అప్రమత్తంగా ఉండాలి

ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రజలకు కీలక సూచనలు చేశారు. ఆన్‌లైన్‌లో కనిపించే ఫ్రాంచైజీలు, ఉద్యోగాలు, రుణాలు, పెట్టుబడులు, లైసెన్సులు వంటి ప్రకటనలను పూర్తిగా ధృవీకరించిన తర్వాతే స్పందించాలని సూచించారు. గుర్తుతెలియని వ్యక్తులు పంపే లింకులు, నకిలీ వెబ్‌సైట్లు, బ్యాంకు ఖాతాలు, యూపీఐ వివరాలను నమ్మి డబ్బులు బదిలీ చేయవద్దని హెచ్చరించారు.

సైబర్ మోసానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ కు సమాచారం అందించాలని, సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని ఎస్పీ సూచించారు.

అంతర్రాష్ట్ర సైబర్ ముఠాను గుర్తించి అరెస్ట్ చేయడంలో కీలకంగా పనిచేసిన సైబర్ క్రైమ్ పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి, జైనథ్ సీఐ జి. శ్రావణ్, ఎస్సైలు పీర్ సింగ్, గౌతం, గోపికృష్ణతో పాటు పోలీసు సిబ్బంది త్రిశూల్, రాజేష్, పురుషోత్తం, రవీందర్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

 

Latest articles

నిరుపేద విద్యార్థులకు అండగా బీఎస్పీ..

పేద విద్యార్థులకు బీఎస్పీ విద్యా సామగ్రి పంపిణీ ఆదిలాబాద్:మన భారత్ ఆగస్టు 24, పేద, నిరుపేద విద్యార్థులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో...

బండారి కొమురయ్య సంవత్సరీకంలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర

బండారి కొమురయ్య సంవత్సరీకంలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర మన భారత్,మొగుళ్ళపల్లి: మొగుల్లపల్లి మండల కేంద్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, తాపీ...

ప్లాట్ విక్రయిస్తానని రూ.5.70 లక్షలు వసూలు..

రియల్ ఎస్టేట్ ఏజెంట్ అరెస్ట్ ఆదిలాబాద్, మన భారత్, ఆగస్టు 23: ప్లాట్ విక్రయిస్తానని నమ్మించి లక్షల రూపాయలు వసూలు...

అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు: సీఐ

తలమడుగులో 300 కిలోల పిడిఎస్ బియ్యం పట్టివేత.. ఒకరి అరెస్ట్ తలమడుగు, ఆగస్టు 23: పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్‌ (PDS)...

More like this

నిరుపేద విద్యార్థులకు అండగా బీఎస్పీ..

పేద విద్యార్థులకు బీఎస్పీ విద్యా సామగ్రి పంపిణీ ఆదిలాబాద్:మన భారత్ ఆగస్టు 24, పేద, నిరుపేద విద్యార్థులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో...

బండారి కొమురయ్య సంవత్సరీకంలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర

బండారి కొమురయ్య సంవత్సరీకంలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర మన భారత్,మొగుళ్ళపల్లి: మొగుల్లపల్లి మండల కేంద్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, తాపీ...

ప్లాట్ విక్రయిస్తానని రూ.5.70 లక్షలు వసూలు..

రియల్ ఎస్టేట్ ఏజెంట్ అరెస్ట్ ఆదిలాబాద్, మన భారత్, ఆగస్టు 23: ప్లాట్ విక్రయిస్తానని నమ్మించి లక్షల రూపాయలు వసూలు...