సైబర్ నేరాలపై అప్రమత్తతే రక్షణ..
మోసపోతే వెంటనే 1930కు కాల్ చేయండి: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
మన భారత్, ఆదిలాబాద్ | జూలై 4
సాంకేతిక పరిజ్ఞానం విస్తరిస్తున్న కొద్దీ సైబర్ నేరాల రూపురేఖలు కూడా వేగంగా మారుతున్నాయని, ప్రజలు ప్రతి ఆన్‌లైన్ లావాదేవీలో అప్రమత్తంగా ఉండాలని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ సూచించారు. బ్యాంకులు, ప్రభుత్వ సంస్థలు, రుణ సంస్థలు లేదా సోషల్ మీడియా పేర్లతో వచ్చే ఫోన్ కాల్స్, సందేశాలు, లింకులు, ఏపీకే (APK) ఫైళ్లు, క్యూఆర్ కోడ్‌ల విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన హెచ్చరించారు.
జిల్లాలో ఇటీవల నమోదవుతున్న సైబర్ నేరాలను పరిశీలిస్తే నేరగాళ్లు కొత్త కొత్త పద్ధతులతో అమాయకులను లక్ష్యంగా చేసుకుని డబ్బులు కాజేస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీలు, క్రెడిట్ కార్డు సమాచారం అడిగే వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మరాదని సూచించారు. అధికారిక వెబ్‌సైట్లు, అధికారిక ఫోన్ నంబర్ల ద్వారానే సమాచారాన్ని ధృవీకరించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఈ వారం జిల్లాలో మొత్తం 9 సైబర్ ఫిర్యాదులు నమోదైనట్లు ఎస్పీ వెల్లడించారు. సోషల్ మీడియా బ్లాక్‌మెయిల్, లోన్ ఫ్రాడ్, క్యూఆర్ కోడ్ మోసాలు, క్రెడిట్ కార్డు ఇంపర్సనేషన్, ఓఎల్ఎక్స్ మోసాలు వంటి వివిధ రకాల కేసులు నమోదయ్యాయని తెలిపారు. ప్రతి ఫిర్యాదుపై సైబర్ పోలీసులు దర్యాప్తు చేపట్టి బాధితులకు అవసరమైన సహాయం అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇటీవలి కాలంలో ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల్లో నకిలీ ఖాతాలు సృష్టించి యువతను బ్లాక్‌మెయిల్ చేయడం, ముద్ర లోన్ పేరుతో ప్రాసెసింగ్ ఫీజులు వసూలు చేయడం, క్యూఆర్ కోడ్‌ల ద్వారా ఖాతాల్లోని డబ్బును కాజేయడం, ఓఎల్ఎక్స్‌లో కొనుగోలు–అమ్మకాల పేరుతో మోసాలకు పాల్పడడం, బ్యాంకు అధికారులమంటూ ఫోన్ చేసి కేవైసీ, ఆధార్, క్రెడిట్ కార్డు వివరాలు సేకరించి మోసాలకు పాల్పడడం వంటి ఘటనలు వెలుగుచూస్తున్నాయని వివరించారు.
అలాగే సోషల్ మీడియా ప్రకటనల ద్వారా గిఫ్ట్ హ్యాంపర్లు, బహుమతులు ఇస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసి ఖాతాలను బ్లాక్ చేయడం, రుణాల పేరుతో నకిలీ రికవరీ ఏజెంట్లు కుటుంబ సభ్యులు, స్నేహితులకు ఫోన్ చేసి బెదిరించడం వంటి ఘటనలు కూడా పెరుగుతున్నాయని పేర్కొన్నారు.
నమోదైన ప్రధాన సైబర్ మోసాల వివరాలు
ఇన్‌స్టాగ్రామ్ ఫేక్ అకౌంట్ – సోషల్ మీడియా బ్లాక్‌మెయిల్
యువకుడి పేరుతో నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా సృష్టించి అసత్య ప్రచారం చేస్తూ పరువు నష్టం కలిగించే పోస్టులు పెట్టి బ్లాక్‌మెయిల్ చేసిన ఘటనపై కేసు నమోదైంది.
ముద్ర లోన్ పేరుతో విషింగ్ స్కామ్
ముద్ర లోన్ మంజూరైందని నమ్మబలికి ప్రాసెసింగ్ ఫీజు, ఇతర చార్జీల పేరుతో పలుమార్లు డబ్బులు వసూలు చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
ఓఎల్ఎక్స్ – క్యూఆర్ కోడ్ మోసం
ఓఎల్ఎక్స్‌లో వస్తువులు విక్రయిస్తున్న వ్యక్తిని కొనుగోలుదారునిగా నమ్మించి క్యూఆర్ కోడ్ పంపి, పిన్ నమోదు చేయించి రూ.94 వేల నగదు కాజేసిన ఘటన నమోదైంది.
ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ఇంపర్సనేషన్ ఫ్రాడ్
ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు అధికారులమంటూ ఫోన్ చేసి ఆధార్ వివరాలతో అక్రమంగా క్రెడిట్ కార్డు తీసుకున్నారని భయపెట్టి డబ్బులు వసూలు చేయాలని ప్రయత్నించిన ఘటనపై ఫిర్యాదు అందింది. ఒకే తరహా మొబైల్ నంబర్ల నుంచి వరుస కాల్స్ రావడంతో ఇది సైబర్ మోసంగా గుర్తించి పోలీసులు విచారణ చేపట్టారు. మోసపోతే వెంటనే చేయాల్సింది ఇదే
ఆర్థిక సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 సైబర్ హెల్ప్‌లైన్ కు కాల్ చేయాలని లేదా జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని జిల్లా ఎస్పీ సూచించారు. ముఖ్యంగా “గోల్డెన్ అవర్”లో ఫిర్యాదు చేస్తే మోసపోయిన నగదును నిలిపివేసే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటేనే సైబర్ నేరాలను సమర్థంగా అరికట్టవచ్చని ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు.
