e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Friday, October 16, 2026

ఆరు నెలల పసికందు ప్రాణానికి ₹16 కోట్ల ఇంజెక్షన్..!

 ప్రభుత్వ సాయం కోసం తల్లిదండ్రుల ఎదురుచూపు

మన భారత్, విజయనగరం:
పుట్టి ఇంకా ఆరు నెలలే అయిన ఓ పసికందు ప్రాణం కాపాడాలంటే అక్షరాలా ₹16 కోట్ల విలువైన అరుదైన ఔషధం అవసరమని వైద్యులు చెప్పడంతో ఓ పేద కుటుంబం తీవ్ర ఆవేదనలో మునిగిపోయింది. కళ్ల ముందే తమ చిన్నారి ప్రాణం కొట్టుమిట్టాడుతుంటే ఏం చేయాలో అర్థంకాక, ప్రభుత్వ సహాయం కోసం ఆ తల్లిదండ్రులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ హృదయ విదారక ఘటన విజయనగరం జిల్లాలో వెలుగులోకి రావడంతో స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం గుచ్చిమి గ్రామానికి చెందిన రాము నాయుడు, రూప దంపతులకు ఆరు నెలల చిన్నారి మోహిష జన్మించింది. కుటుంబానికి ఎంతో ఆనందం తీసుకొచ్చిన ఈ పాపకు కొద్ది రోజులకే అరుదైన జన్యుపరమైన వ్యాధి సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. కండరాల క్షీణతకు దారితీసే SMA (Spinal Muscular Atrophy) తరహా అరుదైన వ్యాధి కారణంగా పాప ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.

ఈ వ్యాధికి పూర్తిస్థాయి చికిత్స అందించాలంటే విదేశాల నుంచి ప్రత్యేకంగా తెప్పించాల్సిన అత్యంత ఖరీదైన ఇంజెక్షన్ అవసరమని, దాని ధర సుమారు ₹16 కోట్లు ఉంటుందని వైద్యులు పేర్కొనడంతో ఆ కుటుంబం షాక్‌కు గురైంది. సాధారణ జీవనం గడిపే ఈ కుటుంబానికి అంతటి భారీ మొత్తాన్ని సమకూర్చడం అసాధ్యమైపోయింది. దీంతో తమ బిడ్డ ప్రాణం కాపాడుకునే మార్గం కనిపించక తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

ఈ దంపతులకు ఇది రెండోసారి ఎదురైన తీరని విషాదం కావడం మరింత కలిచివేస్తోంది. గతంలో కూడా ఇదే తరహా వ్యాధితో తమ మొదటి బిడ్డను కోల్పోయినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆ బాధ నుండి ఇంకా కోలుకోకముందే, ఎంతో ఆశలతో జన్మనిచ్చిన రెండో సంతానం చిన్నారి మోహిషకు కూడా అదే సమస్య రావడంతో ఆ తల్లిదండ్రుల గుండెలు పగిలేలా రోదిస్తున్నారు.

“మా జీవితంలో అంత సొమ్ము చూడలేదు. మా పాపను మా చేతులతో కాపాడుకోలేని పరిస్థితి వచ్చింది. ప్రభుత్వమే దయతలిచి మా బిడ్డకు ప్రాణభిక్ష పెట్టాలి” అంటూ తల్లిదండ్రులు చేతులు జోడించి వేడుకుంటున్నారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, జిల్లాకు చెందిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పందించి ముఖ్యమంత్రి సహాయ నిధి లేదా ప్రత్యేక నిధుల ద్వారా తమ బిడ్డకు వైద్యం అందించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

చిన్నారి ప్రాణం కాపాడేందుకు ప్రభుత్వం, దాతలు, సేవా సంస్థలు తక్షణమే స్పందించాలని స్థానికులు కూడా కోరుతున్నారు. అరుదైన వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు ప్రభుత్వ స్థాయిలో ప్రత్యేక వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని సామాజిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఒక పసి ప్రాణం కోసం జరుగుతున్న ఈ పోరాటం ఇప్పుడు అందరి హృదయాలను కదిలిస్తోంది.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE