మన భారత్, మొగుళ్ళపల్లి:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలంలోని రంగాపురం గ్రామంలో చోటుచేసుకున్న హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ విషయాన్ని చిట్యాల సీఐ దగ్గు మల్లేష్ యాదవ్, మొగుళ్ళపల్లి ఎస్ఐ ముప్పు సురేష్ వెల్లడించారు.
బుధవారం మొగుళ్ళపల్లి పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను అధికారులు తెలియజేశారు. రంగాపురం గ్రామానికి చెందిన చిలువేరు పోశయ్య (66)పై పాత కక్షల నేపథ్యంలో ఏప్రిల్ 4, 2026న ఇనుగాల కుమారస్వామి కర్రతో దాడి చేసినట్లు తెలిపారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన పోశయ్యను ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఏప్రిల్ 18, 2026న వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో మృతి చెందినట్లు పేర్కొన్నారు.
మృతుని భార్య ఫిర్యాదు మేరకు బిఎన్ఎస్ సెక్షన్ 103 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. కేసు విచారణలో భాగంగా చిట్యాల సీఐ దగ్గు మల్లేష్ యాదవ్, ఎస్ఐ ముప్పు సురేష్ నేతృత్వంలో పోలీస్ బృందం 2026 ఏప్రిల్ 22 ఉదయం 11:10 గంటలకు మొగుళ్ళపల్లి పెద్దమ్మ తల్లి గుడి వద్ద నిందితుడిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.
అరెస్టు అనంతరం నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరచి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతున్నదని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
