e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Saturday, October 17, 2026

బోర్డు నీడనే ప్రయాణికులకు దిక్కు..

మన భారత్ , తలమడుగు: 

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్‌లో కనీస వసతుల కొరతతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పూర్తిస్థాయి షెల్టర్ లేకపోవడం వల్ల ఎండలు, వర్షాల్లో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

శ్రీరామనవమి సందర్భంగా హాలిడేస్ కారణంగా బస్సులు సరిగా నడవకపోవడంతో, స్థానిక ప్రజలు తమ అవసరాల నిమిత్తం లోకల్ ట్రైన్ ద్వారా ఆదిలాబాద్‌కు ప్రయాణించారు. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని ఆటో డ్రైవర్లు తలమడుగు నుంచి ఆదిలాబాద్ వరకు టికెట్ ధరలను పెంచినట్లు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం రూ.40 వరకు వసూలు చేస్తున్నారని వారు తెలిపారు.

రైల్వే స్టేషన్‌లో తాగునీటి సౌకర్యం లేకపోవడం, ప్రయాణికుల కోసం కూర్చునే ఏర్పాట్లు లేకపోవడం, షెల్టర్ సరిగా లేకపోవడం వంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. దీంతో వృద్ధులు, మహిళలు, చిన్నారులు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇప్పటికే నాందేడ్ డివిజన్ రైల్వే మేనేజర్ తలమడుగు రైల్వే స్టేషన్‌ను సందర్శించి పరిస్థితులను పరిశీలించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్, గ్రామస్తులు స్టేషన్‌లో ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగేలా చర్యలు తీసుకోవాలని, అలాగే మౌలిక వసతులను మెరుగుపరచాలని విజ్ఞప్తి చేశారు.

ఈ అంశంపై డివిజన్ మేనేజర్ సానుకూలంగా స్పందించినప్పటికీ, ఇప్పటివరకు స్పష్టమైన చర్యలు కనిపించలేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పూర్తి స్థాయి షెల్టర్ నిర్మాణం, తాగునీటి సదుపాయం, ప్రాథమిక వసతుల కల్పనతో పాటు రైళ్ల నిలుపుదలపై నిర్ణయం తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ప్రజల సౌకర్యం, భద్రత దృష్ట్యా రైల్వే అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE