e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Saturday, October 17, 2026

కెమికల్ డ్రగ్స్ ముఠా గుట్టురట్టు..

మన భారత్, ఆదిలాబాద్

ఆదిలాబాద్‌లో కెమికల్ డ్రగ్స్ ముఠా గుట్టురట్టు

‘టర్మిన్’ మత్తు ఇంజెక్షన్ల అక్రమ విక్రయాలపై పోలీసుల దాడి – ముగ్గురు అరెస్టు, నలుగురు పరారీ

ఆదిలాబాద్, జూలై 13 (మన భారత్): ఆదిలాబాద్ పట్టణంలో వైద్య అవసరాలకు మాత్రమే వినియోగించాల్సిన “టర్మిన్ (Mephentermine Sulphate Injection IP)” మత్తు ఇంజెక్షన్లను అక్రమంగా విక్రయిస్తున్న ముఠాను ఆదిలాబాద్ టూ టౌన్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో మొత్తం ఏడుగురు నిందితులపై కేసు నమోదు చేయగా, ముగ్గురిని అరెస్టు చేసి, నలుగురు పరారీలో ఉన్నట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఐపీఎస్ వెల్లడించారు.

జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వివరాలు వెల్లడిస్తూ, జూలై 12 రాత్రి ఆదిలాబాద్ ఆర్టీసీ బస్టాండ్ పరిసరాల్లో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా స్కూటీపై వెళ్తున్న వ్యక్తిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా అతడు పారిపోవడానికి యత్నించాడని తెలిపారు. వెంటనే పోలీసులు వెంబడించి అదుపులోకి తీసుకుని విచారించగా, అతడు శాంతినగర్‌కు చెందిన ఆర్‌ఎంపీ వైద్యుడు సిందే జగన్నాథ్ అని గుర్తించినట్లు చెప్పారు.

పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. శస్త్రచికిత్సల సమయంలో మాత్రమే వైద్యులు వినియోగించాల్సిన “టర్మిన్” మత్తు ఇంజెక్షన్లను కొంతమంది మెడికల్ షాపుల నిర్వాహకులు, మెడికల్ ఏజెన్సీల నుంచి తక్కువ ధరలకు కొనుగోలు చేసి, గంజాయి వినియోగదారులు మరియు ఇతర వ్యక్తులకు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు నిందితుడు అంగీకరించినట్లు ఎస్పీ తెలిపారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడైన సిందే జగన్నాథ్‌తో పాటు గెట్ వెల్ మెడికల్ నిర్వాహకుడు సయ్యద్ కమరుద్దీన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడు ఇప్పటికే పోలీసుల అదుపులో ఉండగా, జగదాంబ ఫార్మసీ అండ్ సర్జికల్స్‌కు చెందిన రమేష్ గౌడ్, ముషారఫ్, సమీర్, ఇర్ఫాన్ ఖాన్, ముకీద్ ప్రస్తుతం పరారీలో ఉన్నారని, వారిని త్వరలోనే అరెస్టు చేస్తామని ఎస్పీ తెలిపారు.

ఎస్పీ వివరాల ప్రకారం, ఒక్క టర్మిన్ ఇంజెక్షన్ అధికారిక ధర సుమారు రూ.390 మాత్రమే ఉండగా, అక్రమంగా ఒక్కో బాటిల్‌ను రూ.1,500 వరకు విక్రయిస్తూ భారీగా లాభాలు ఆర్జిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. డాక్టర్లకు మాత్రమే సరఫరా చేయాల్సిన ఈ ఔషధాన్ని నిబంధనలకు విరుద్ధంగా బహిరంగంగా విక్రయించడం అత్యంత ప్రమాదకరమని ఆయన పేర్కొన్నారు.

పోలీసులు నిందితుల వద్ద నుంచి 190 ఇన్సులిన్ సిరంజిలు, 50 టర్మిన్ మత్తు ఇంజెక్షన్ బాటిల్స్, రెండు మొబైల్ ఫోన్లు, ఒక స్కూటీ స్వాధీనం చేసుకున్నారు.

గతంలో కూడా ఆదిలాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి టర్మిన్ మత్తు ఇంజెక్షన్లు దొంగిలించిన కేసును పోలీసులు ఛేదించిన విషయాన్ని ఎస్పీ గుర్తు చేశారు. వైద్య అవసరాల కోసం మాత్రమే వినియోగించాల్సిన మందులను అక్రమంగా విక్రయించే వ్యక్తులు, మెడికల్ షాపులు, ఏజెన్సీలపై కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు.

ఈ కేసును ఛేదించడంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి పర్యవేక్షణలో టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ కె. నాగరాజు, ఎస్‌ఐలు అఖిల్, ప్రణయ్ కుమార్‌తో పాటు పోలీసు బృందం కీలక పాత్ర పోషించినట్లు ఎస్పీ అభినందించారు.

మీ గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్

ఆదిలాబాద్ జిల్లాలో మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE