అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఫూలే దంపతుల చిత్రపటాలు ఏర్పాటు చేయాలి
జిల్లా కలెక్టర్ రాజర్షి షా ను కోరిన మాలి మహా సంఘం నేతలు
మన భారత్, ఆదిలాబాద్ : భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే జయంతిని ప్రతి సంవత్సరం జనవరి 3న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మరియు అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో మహాత్మ జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి పూలేల చిత్రపటాలను ఏర్పాటు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని అఖిల భారతీయ మాలి మహా సంఘం రాష్ట్ర అధ్యక్షులు, హిందీ భాషా సేవా సమితి జిల్లా అధ్యక్షులు సుకుమార్ పెట్కులే నేతృత్వంలోని బృందం జిల్లా కలెక్టర్ రాజర్షి షా ను కోరారు.

ఈ మేరకు మాలి మహా సంఘం, హిందీ భాషా సేవా సమితి నేతలు జిల్లా పరిషత్ సమావేశ మందిర ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా తో పాటు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి రాజేశ్వర్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. జనవరి 3న జ్ఞాన జ్యోతి సావిత్రిబాయి పూలే 195వ జయంతిని రాష్ట్ర పండుగగా జరుపుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సందర్భంగా, జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో కృషి చేయాలని వారు కోరారు.
సామాజిక ఉద్యమ పితామహుడు మహాత్మ జ్యోతిరావు ఫూలే, భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలేలు స్త్రీ విద్య, సామాజిక న్యాయం కోసం ఎనలేని త్యాగాలు చేశారని నేతలు గుర్తు చేశారు. వారి సేవలను స్మరిస్తూ అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, పాఠశాలల్లో ఫూలే దంపతుల చిత్రపటాలు ఏర్పాటు చేయడం ద్వారా విద్యార్థులకు, సమాజానికి ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. అలాగే అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మాలి మహా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాంబన్న శేండే, రాష్ట్ర కోశాధికారి సతీష్ గురునూలే, హిందీ భాషా సేవా సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి భాస్కర్ ప్రధాన్, సంయుక్త కార్యదర్శి అనిల్ కోట్రంగే తదితరులు పాల్గొన్నారు.
