శుక్ర మూఢమితో మూడు నెలలు శుభకార్యాలకు బ్రేక్
మన భారత్, స్టేట్ బ్యూరో: వివాహాలు, గృహప్రవేశాలు, శుభకార్యాలు ప్లాన్ చేస్తున్న కుటుంబాలకు నిరాశ కలిగించే వార్త ఇదే. రాబోయే 83 రోజులపాటు ఒక్క మంచి ముహూర్తం కూడా లేదని పండితులు స్పష్టం చేస్తున్నారు. కారణం శుక్ర మూఢమి. ఈ మూఢమి ప్రభావం వచ్చే ఏడాది 2026 ఫిబ్రవరి 17 వరకు కొనసాగుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
నవంబర్ 26 నుంచి మాఘ బహుళ అమావాస్య (ఫిబ్రవరి 17) వరకు 83 రోజులపాటు శుక్రుడు, గురుడు సూర్యునికి అత్యంత సమీపంగా ఉండే ఈ కాలాన్ని మూఢ కాలంగా పరిగణిస్తారు. ఈ సమయంలో ఈ గ్రహాలు బలాన్ని కోల్పోతాయి కాబట్టి వివాహాలు, నూతన గృహప్రవేశాలు, విగ్రహ ప్రతిష్ఠలు వంటి శుభకార్యాలు నిర్వహించరని పండితులు వివరిస్తున్నారు. అయితే రోజువారీ పూర్తిచేయాల్సిన నిత్యకర్మలకు మాత్రం మూఢకాల ప్రభావం ఉండదని తెలిపారు.
ఈసారి మాఘమాసంలో కూడా శుభముహూర్తాలు లేవు!
ప్రతి సంవత్సరం మాఘమాసంలో పెళ్లిళ్ల హడావిడి ఉంచడానికి ఫంక్షన్ హాళ్లు, కమ్యూనిటీ హాళ్లు ఖాళీలు కూడా లేకుండా ఉండేవి. కానీ ఈసారి శుక్ర మూఢ కాలం మాఘమాసానికే పడటంతో పెళ్లి ముహూర్తాలు లేక బుకింగ్స్ నామమాత్రంగానే ఉన్నాయని హాళ్ల నిర్వాహకులు చెబుతున్నారు.
వివాహం ప్లాన్ చేస్తున్న జంటలు, కుటుంబాలు ఇప్పుడు ఫిబ్రవరి 18, 2026 తర్వాతే శుభముహూర్తాలను చూడాల్సి ఉంటుంది. అంటే దాదాపు మూడు నెలలపాటు శుభకార్యాలకు పూర్తి బ్రేక్.
