అనుమతుల్లేని ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోండి: బయలు బైల పాటి గణేష్ డిమాండ్
మన భారత్, మెదక్: నర్సాపూర్ పట్టణంలో అనుమతులు లేకుండా నడుస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని నేత బయలు బైల పాటి గణేష్ కోరారు. ఎన్నిసార్లు గుర్తు చేసినా కూడా సంబంధిత శాఖ అధికారులు ముఖ్యంగా ఎంఈవో నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తున్నారని ఆయన విమర్శించారు.
గణేష్ పేర్కొన్నదాని ప్రకారం—అనుమతులులేని పాఠశాలలు నిర్మొహమాటంగా కార్యకలాపాలు కొనసాగిస్తుండగా, వాటి వివరాలను సేకరించి సమర్పించాలనే సూచనలను ఎంఈవో పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వ పాఠశాలలను పక్కనపెట్టి ప్రైవేట్ పాఠశాలల పక్షపాతం చూపుతున్న అధికారులపై విచారణ జరపాలని, బాధ్యత వహించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కు ప్రత్యేక లేఖ ద్వారా వినతి సమర్పించినట్లు తెలిపారు.
ఇప్పటికైనా విద్యా వ్యవస్థ ప్రతిష్టను నిలబెట్టేందుకు అనుమతుల్లేని విద్యాసంస్థలపై కఠినమైన చర్యలు చేపట్టాలని, అలాగే అధికారులు విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించకుండా పర్యవేక్షణను పటిష్ఠం చేయాలని కలెక్టర్, డీఈఓలను గణేష్ డిమాండ్ చేశారు.
