ఎస్ఐ రాజేష్ గోడ దూకి పరుగు… టేక్మాల్ పోలీస్ స్టేషన్‌లో సంచలన ఘటన
మన భారత్, టేక్మాల్ (మెదక్): మెదక్ జిల్లాలోని టేక్మాల్ పోలీస్ స్టేషన్ ఆదివారం అర్ధరాత్రి సినిమా సన్నివేశాలను తలపించే ఘటనకు వేదికైంది. ఒక కేసుకు సంబంధించి రూ.20 వేల లంచం స్వీకరిస్తూ రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులకు చిక్కిన సబ్ ఇన్స్పెక్టర్ రాజేష్, విచారణ జరుగుతుండగానే అకస్మాత్తుగా పోలీసులు, ఏసీబీ సిబ్బందిని ఆశ్చర్యపరుస్తూ స్టేషన్ గోడ దూకి పారిపోయాడు.
ఏసీబీ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న సమయంలో తప్పించుకునే ప్రయత్నం చేసిన రాజేష్, పోలీస్ స్టేషన్ వెనుక వైపు గోడ ఎక్కి బయటకు పరుగులు తీశాడు. అయితే ఎక్కువసేపు దాగలేకపోయాడు. వెంటాడిన ఏసీబీ సిబ్బంది కొద్ది దూరం వెళ్లగానే అతన్ని మళ్లీ పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు.
ఈ సంఘటన టేక్మాల్ పట్టణంలో కలకలం రేపింది. ఎస్ఐ రాజేష్ అవినీతి కేసులో చిక్కడంతో, స్థానికులు తిరుగుబాటు జ్వాల లాంటి సంబరాలు నిర్వహించారు. పోలీస్ స్టేషన్ ముందు పెద్ద సంఖ్యలో ప్రజలు చేరి టపాసులు కాల్చడం విశేషం.
