శివ్వంపేటలో WDCW ఆధ్వర్యంలో అవగాహన సదస్సు
మన భారత్, మెదక్ జిల్లా: బాల్యవివాహాలు సమాజ అభివృద్ధికి అడ్డంకి అని, వాటిని నిర్మూలించడం అందరి బాధ్యత అని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ (WDCW) ఆధ్వర్యంలో శివ్వంపేటలో నిర్వహించిన బాల్యవివాహాల నిర్మూలన ,బాలల అభివృద్ధిపై అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
కలెక్టర్ మాట్లాడుతూ ..“బాల్యవివాహాలు జరగకుండా గ్రామాలు, తండాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలి. బాల్యవివాహం జరిగితే అంగన్వాడీ, ఆశా, పంచాయతీ కార్యదర్శులే బాధ్యత వహించాలి. మెదక్ జిల్లాను బాల్యవివాహాలు లేని జిల్లాగా మార్చడం మనందరి లక్ష్యంగా ఉండాలి,” అని స్పష్టం చేశారు.
అలాగే ఆయన మాట్లాడుతూ ..“ప్రతి పిల్లవాడు, పిల్ల ఒకరు బడిలో ఉండాలి. పిల్లల చేత పనిచేయించడం నేరం. కిశోర బాలికల వివరాలు ప్రతి బీ.ఎల్.ఓ వద్ద తప్పనిసరిగా ఉండాలి. వారు ఎక్కడ చదువుతున్నారు, ఏం చేస్తున్నారు అన్న వివరాలు నిరంతరం సేకరించాలి,” అని అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా డీడబ్ల్యూఓ హేమ భార్గవి మాట్లాడుతూ గ్రామాలు, తండాల్లో బాల్యవివాహాల నిర్మూలన కోసం అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం WDCW, ICDS ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించగా, అధికారులు, సిబ్బంది బాల్యవివాహాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని ప్రతిజ్ఞ చేశారు.
కార్యక్రమంలో ఆర్డీవో మహిపాల్ రెడ్డి, తహసీల్దార్ కమలాద్రి, ఐసిడిఎస్ మండల సూపర్వైజర్లు సంతోష, వసుమతి, ఐకెపి, అంగన్వాడీ, ఆశా, పంచాయతీ సెక్రటేరియట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
