e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Friday, October 16, 2026

ఎల్‌నినోకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలి..

నీటి లభ్యత ఆధారంగా పంటల సాగు వేసవిలో తాగునీరు, పశువుల నీటి అవసరాలకు ప్రాధాన్యం

 

అధికారులకు జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదేశాలు

మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 16,

రానున్న యాసంగి సీజన్‌లో ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని, కరువు పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందస్తు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. నీటి లభ్యతకు అనుగుణంగా పంటల సాగు ప్రణాళికలు సిద్ధం చేయడంతో పాటు, ప్రత్యామ్నాయ పంటల సాగు, నీటి పొదుపు పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.

గురువారం సాయంత్రం ఆదిలాబాద్‌లోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై వ్యవసాయ, ఉద్యానవన, నీటిపారుదల, భూగర్భ జలాలు, విద్యుత్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మున్సిపల్ తదితర శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల పరిధిలో చేపట్టాల్సిన చర్యలు, నీటి వనరుల లభ్యత, వ్యవసాయ రంగానికి ఎదురయ్యే సవాళ్లపై చర్చించారు.

నీటి వనరుల లభ్యతపై సమగ్ర అంచనా

వాతావరణ పరిస్థితుల్లో చోటుచేసుకునే మార్పులను ముందుగానే అంచనా వేసి తగిన చర్యలు చేపడితే కరువు ప్రభావాన్ని తగ్గించే అవకాశం ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలోని ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు, ఫామ్‌ పాండ్లు, బోర్లు, బావుల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి పరిమాణంపై క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు.

భూగర్భ జలాల పరిస్థితి, సాగు విస్తీర్ణం, వివిధ పంటలకు అవసరమయ్యే నీటి పరిమాణాన్ని పరిగణనలోకి తీసుకుని సమగ్ర నివేదిక రూపొందించాలన్నారు. నీటి లభ్యత ఆధారంగా ఏ ప్రాంతంలో ఏ పంటలు సాగు చేయాలి, అందుబాటులో ఉన్న నీటితో ఎన్ని రోజులు, ఎన్ని తడులు అందించగలమనే అంశాలపై స్పష్టమైన ప్రణాళిక ఉండాలని సూచించారు.

అధిక నీటి వినియోగం కలిగిన పంటల వల్ల భూగర్భ జలాలపై ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉన్నందున, తక్కువ నీటితో సాగు చేయగల ఆరుతడి, ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని తెలిపారు. వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు రైతులను నేరుగా కలిసి పంటల ఎంపిక, నీటి పొదుపు పద్ధతులపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. రైతుల బోర్లు, బావులు, ఇతర నీటి వసతుల వివరాలను వ్యవసాయ శాఖ ఏఈవోలు క్షేత్రస్థాయిలో సేకరించి నివేదిక సమర్పించాలని సూచించారు.

నీటి ఎద్దడి ప్రాంతాలను ముందుగానే గుర్తించాలి

నీటిపారుదల, భూగర్భ జలాలు, వ్యవసాయ, ఉద్యానవన, ప్రణాళికా శాఖలు సమన్వయంతో నీటి వనరుల వివరాలను క్రోడీకరించాలని కలెక్టర్ తెలిపారు. భవిష్యత్తులో నీటి ఎద్దడి ఏర్పడే అవకాశమున్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి, అక్కడ ఎదురయ్యే సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు, అవసరమైన ప్రభుత్వ సహకారానికి సంబంధించిన వివరాలతో నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించారు.

చెరువులు, కుంటలు, ఫామ్‌ పాండ్లలో అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించేలా చర్యలు చేపట్టాలని, నీటి వనరుల సంరక్షణతో పాటు వర్షపు నీటిని ఒడిసిపట్టే పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

ఉపాధి హామీ పనులతో నీటి సంరక్షణ

ఉపాధి హామీ పథకం ద్వారా ఇంకుడు గుంతల నిర్మాణం, చెరువులు, కుంటల్లో పూడికతీత, నీటి సంరక్షణ, నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచే పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామాల వారీగా అవసరమైన పనులను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో చేపట్టడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు ఎక్కువ పనిదినాలు కల్పించేలా కార్యాచరణ రూపొందించాలని తెలిపారు.

జలసిరి కార్యక్రమంలో భాగంగా వి.బి.-జి. రామ్‌జీ కింద సుమారు 5,000కు పైగా ఫామ్‌ పాండ్ల నిర్మాణ పనులను తక్షణమే ప్రారంభించాలని సంబంధిత అధికారులకు సూచించారు. నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచే పనులను నిర్దేశిత కాలవ్యవధిలో పూర్తి చేసేలా పర్యవేక్షణ చేపట్టాలన్నారు.

వేసవిలో తాగునీటి సరఫరాకు ముందస్తు ఏర్పాట్లు

రానున్న వేసవిలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి కొరత తలెత్తకుండా పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. నీటి సమస్యలు ఎదురయ్యే ప్రాంతాలను ముందుగానే గుర్తించి ప్రత్యామ్నాయ నీటి వనరులను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.

పశువులకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. గ్రామాల్లో పశువుల కోసం నీటి తొట్టెలు ఏర్పాటు చేసేందుకు పశుసంవర్ధక శాఖ, డీఆర్‌డీవో అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వి.బి.-జి. రామ్‌జీ కింద ఈ పనులను కూడా వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు.

నిరంతర విద్యుత్ సరఫరాపై దృష్టి

వ్యవసాయ అవసరాలకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా జరిగేలా విద్యుత్ శాఖ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయాలు ఏర్పడుతున్న ప్రాంతాలను గుర్తించి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సూచించారు. వ్యవసాయ విద్యుత్ సరఫరాను క్రమబద్ధీకరించడంతో పాటు విద్యుత్ వృథాను అరికట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు.

మల్టీ కాంప్లెక్స్‌లు, ఫంక్షన్ హాళ్లు, షాపింగ్ మాల్స్, పెట్రోల్ బంకులు తదితర సంస్థల్లో సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటును ప్రోత్సహించాలని సంబంధిత అధికారులకు సూచించారు.

రైతు వేదికల ద్వారా అవగాహన సదస్సులు

ఎల్‌నినో ప్రభావం, నీటి లభ్యతకు అనుగుణంగా పంటల ఎంపిక, ప్రత్యామ్నాయ పంటల సాగు, నీటి పొదుపు, భూగర్భ జలాల సంరక్షణ తదితర అంశాలపై ప్రతి మండలంలోని రైతు వేదికల ద్వారా అవగాహన సదస్సులు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.

రైతులకు ముందస్తుగా వ్యవసాయ సూచనలు అందించడం ద్వారా పంట నష్టాలను తగ్గించడంతో పాటు అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థంగా వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ప్రతి శాఖ తన పరిధిలో చేపట్టాల్సిన పనులను నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని, ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, డీఆర్‌డీవో రవీందర్ రాథోడ్, సీపీఓ వెంకటరమణ, జిల్లా వ్యవసాయాధికారి రవీందర్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రామారావు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సందీప్ కుమార్, విద్యుత్ శాఖ ఎస్‌ఈ సుభాష్, మున్సిపల్ కమిషనర్ జగదీష్ గౌడ్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Cell Number : cell_number : 9573391945

User Name : user_name : Gontimukkula prasad

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE