మన భారత్ | తలమడుగు | ఆదిలాబాద్ | జూలై 14, 2026
ప్రభుత్వ విద్య బలోపేతానికి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సంఘాలు సమిష్టిగా పోరాడాలి: ఉపాధ్యాయుడు కలవల శంకర్ విజ్ఞప్తి
జీవో నెం.25 సవరణ, ప్రాథమిక పాఠశాలల పరిరక్షణ, ఉపాధ్యాయ పోస్టుల భద్రత, నాణ్యమైన విద్య కోసం సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని పిలుపు
మన భారత్, తలమడుగు:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు ప్రాథమిక విద్యను పరిరక్షించేందుకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లోని అన్ని ఉపాధ్యాయ సంఘాలు సంఘటితంగా కృషి చేయాలని ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కజ్జర్ల ఎంపీపీఎస్ పాఠశాలలో ఎస్‌జీటీగా పనిచేస్తున్న కలవల శంకర్ విజ్ఞప్తి చేశారు.
ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సభ్యులు, రాష్ట్రంలోని గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులకు ఆయన లేఖ రాశారు. ప్రభుత్వంతో జరగనున్న జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియకు ముందుగా విద్యా వ్యవస్థకు మేలు చేసే విధానపరమైన నిర్ణయాలు తీసుకునేలా సంఘాలు సమిష్టిగా కృషి చేయాలని కోరారు.
ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల విశ్వాసాన్ని పెంపొందించడం, విద్యార్థుల నమోదు పెంచడం, ఉపాధ్యాయుల మనోధైర్యాన్ని కాపాడడం, ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించడం అత్యంత అవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో ఉపాధ్యాయ సంఘాలపై చారిత్రాత్మక బాధ్యత ఉందని అభిప్రాయపడ్డారు.
కలవల శంకర్ తన వినతిపత్రంలో జీవో నెం.25ను తక్షణమే సవరించాలని ప్రధానంగా కోరారు. విద్యార్థి–ఉపాధ్యాయ నిష్పత్తిని తగ్గించి ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు, ప్రతి పాఠశాలకు ఒక ప్రధానోపాధ్యాయుని పోస్టు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా సబ్జెక్టు ఉపాధ్యాయులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (పీడీ), గెజిటెడ్ హెడ్మాస్టర్ (జీహెచ్‌ఎం) పోస్టులు కొనసాగుతున్నట్లే, ప్రాథమిక పాఠశాలల్లో కూడా నాలుగు సబ్జెక్టులకు నలుగురు ఉపాధ్యాయులను నియమిస్తే విద్యా బోధనలో నాణ్యత మరింత మెరుగుపడుతుందని అభిప్రాయపడ్డారు.
అలాగే విధానపరమైన నిర్ణయాలు తీసుకున్న తర్వాతే ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ చేపట్టాలని, అప్పుడే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఒకే ప్రాంగణంలో ఉన్న ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలను ఒకే ప్రధానోపాధ్యాయుని ఆధ్వర్యంలో నిర్వహించడం ద్వారా పరిపాలనా సమన్వయం, విద్యా కొనసాగింపు, వనరుల సమర్థ వినియోగం సాధ్యమవుతుందని సూచించారు.
ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (FLN) కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేసి ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన బోధన అందించేలా చర్యలు తీసుకోవాలని, ఉపాధ్యాయులు బోధనేతర పనుల నుంచి విముక్తి పొంది పూర్తిగా తరగతి బోధనపై దృష్టి సారించే పరిస్థితులు కల్పించాలని కోరారు.
తెలంగాణకు దీర్ఘకాలిక విద్యా విధానాన్ని రూపొందించి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా నాణ్యత, జవాబుదారీతనం, సమర్థవంతమైన పర్యవేక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సూచించారు.
బడిబాట కార్యక్రమాల్లో తల్లిదండ్రులు “ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య ఉంటే మీ పిల్లలను ఎందుకు అక్కడ చదివించడం లేదు?” అని ఉపాధ్యాయులను ప్రశ్నిస్తున్నారని, ఈ ప్రశ్నకు సమాజం ముందు గౌరవప్రదమైన సమాధానం వచ్చేలా ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని కలవల శంకర్ పేర్కొన్నారు.
ప్రభుత్వ విద్యా వ్యవస్థ అభివృద్ధి కోసం ఉపాధ్యాయుల సంఖ్య, పాఠశాలల సామర్థ్యం, సమర్థవంతమైన పరిపాలన, జవాబుదారీతనం, నాణ్యమైన బోధన అనే ఐదు అంశాలను సమన్వయంతో అమలు చేయాలని, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లోని అన్ని ఉపాధ్యాయ సంఘాలు ఈ అంశాల సాధన కోసం సమిష్టిగా ఉద్యమించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
