బజార్ హత్నూర్ మోడల్ స్కూల్‌లో ‘ఆరోగ్య పాఠశాల’ ప్రారంభం – ఆరోగ్యవంతమైన విద్యార్థులే దేశ భవిష్యత్: ఎమ్మెల్యే అనిల్ జాదవ్
మన భారత్ | బజార్హత్నూర్ | జూలై 2, 2026
విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రత, పోషకాహారం, మానసిక వికాసానికి ప్రాధాన్యతనిస్తూ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఆరోగ్య పాఠశాల కార్యక్రమాన్ని బజార్హత్నూర్ మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్‌లో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ జిల్లా కలెక్టర్ రాజర్షి షాతో కలిసి గురువారం ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. ఆరోగ్యవంతమైన శరీరం, ప్రశాంతమైన మనస్సు ఉన్నప్పుడే విద్యార్థులు చదువులో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తారని అన్నారు. కష్టపడి చదవడం కంటే ఇష్టపడి చదివితేనే విజయాలు సులభంగా సాధించవచ్చని విద్యార్థులకు ప్రేరణనిచ్చారు.
విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రతను అలవర్చుకోవడంతో పాటు సమతుల పోషకాహారం తీసుకోవడం, ప్రతిరోజూ వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం ద్వారా శారీరక, మానసికంగా దృఢంగా ఎదగాలని సూచించారు. పాఠశాల స్థాయి నుంచే ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు.
కార్యక్రమంలో భాగంగా పోక్సో (POCSO) క్యాలెండర్తో పాటు యాంటీ డ్రగ్స్ అవగాహన పోస్టర్లను ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ కలిసి ఆవిష్కరించారు. చిన్నారుల భద్రత, మాదకద్రవ్యాల నివారణపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు.
అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు, వైద్యశాఖ అధికారులు, ఉపాధ్యాయులతో కలిసి ఆరోగ్య పాఠశాల కార్యక్రమం అమలుపై సమీక్ష నిర్వహించారు. విద్యార్థులకు అవసరమైన ఆరోగ్య పరీక్షలు, వైద్య సేవలు, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు నిరంతరం నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, వైద్యశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.
