మన భారత్, ఆదిలాబాద్:
మద్యం మత్తులో వాహనం నడిపి పోలీసుపై దాడి.. నిందితుడిని జైలుకు తరలించిన పోలీసులు
గుడిహత్నూర్: జాతీయ రహదారిపై విధులు నిర్వహిస్తున్న పోలీసు కానిస్టేబుల్‌పై దాడికి పాల్పడిన కంటైనర్ డ్రైవర్‌ను గుడిహత్నూర్ పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం అతనికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విజయ్ అనే కంటైనర్ డ్రైవర్ మద్యం మత్తులో వాహనం నడుపుతూ గుడిహత్నూర్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ తనిఖీల సమయంలో పోలీసులకు చిక్కాడు. విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ వాహనాన్ని నిలిపివేసి తనిఖీలు నిర్వహించే క్రమంలో డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించినట్లు సమాచారం.
డ్రంకెన్ డ్రైవ్ పరీక్ష నిర్వహించగా అతడు మద్యం సేవించినట్లు నిర్ధారణ అయింది. దీంతో పోలీసులు చట్టపరమైన చర్యలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. అయితే తనపై కేసు నమోదు చేయడాన్ని వ్యతిరేకించిన డ్రైవర్ విజయ్, విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌తో వాగ్వాదానికి దిగడమే కాకుండా దాడికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.
ఘటన అనంతరం వెంటనే స్పందించిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించడం, విధుల్లో ఉన్న పోలీసు అధికారిపై దాడి చేయడం, మద్యం మత్తులో వాహనం నడపడం వంటి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
అనంతరం నిందితుడిని స్థానిక న్యాయస్థానంలో హాజరుపరచగా, కేసు వివరాలను పరిశీలించిన న్యాయమూర్తి అతనికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు అతడిని జైలుకు తరలించారు.
ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, ప్రజల ప్రాణ భద్రత కోసం ట్రాఫిక్ తనిఖీలు నిర్వహిస్తున్నామని, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై, విధుల్లో ఉన్న అధికారులపై దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
