చీపురుపల్లి జంక్షన్‌లో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని ప్రభుత్వానికి వినతిపత్రం
మన భారత్, ఆంధ్ర ప్రదేశ్:
రాష్ట్రంలో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై మాజీ మంత్రి, ప్రస్తుత శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ప్రజలపై అదనపు భారాలు మోపుతూ సామాన్య ప్రజల జీవనాన్ని కష్టాల్లోకి నెడుతోందని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంధన ధరల పెంపును నిరసిస్తూ సోమవారం చీపురుపల్లి జంక్షన్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బొత్స సత్యనారాయణ పార్టీ శ్రేణులతో కలిసి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై గళమెత్తారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బొత్స సత్యనారాయణ.. ఎన్నికల ముందు సంపద సృష్టిస్తామని హామీలు ఇచ్చిన కూటమి నాయకులు, ఇప్పుడు ప్రజల సంపదనే దోచుకుంటున్నారని తీవ్రంగా విమర్శించారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరిగి సామాన్య కుటుంబాల ఆర్థిక పరిస్థితి దెబ్బతింటోందన్నారు. రైతులు, కూలీలు, ఆటో డ్రైవర్లు, చిన్న వ్యాపారులు పెరిగిన ఇంధన ధరల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని బొత్స ఆరోపించారు. ముఖ్యంగా వికలాంగులకు కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని చెప్పి రెండు సంవత్సరాలు గడిచినా అమలు చేయలేదని మండిపడ్డారు. ప్రజల సంక్షేమం పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, ప్రజలను మోసం చేస్తూ పాలన సాగిస్తోందని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు అన్నింటిని గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రజా సమస్యలపై ఉద్యమాలు కొనసాగిస్తామని తెలిపారు. వెంటనే పెంచిన ఇంధన ధరలను తగ్గించి ప్రజలకు ఉపశమనం కల్పించాలని డిమాండ్ చేశారు.
నిరసన కార్యక్రమం అనంతరం బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ చీపురుపల్లి మండల రెవెన్యూ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా రూపొందించిన వినతిపత్రాన్ని అధికారులకు సమర్పించారు. ర్యాలీలో పెద్ద సంఖ్యలో మహిళలు, యువకులు, పార్టీ అభిమానులు పాల్గొనడంతో చీపురుపల్లి జంక్షన్ ప్రాంతం నినాదాలతో మార్మోగింది.
ఈ కార్యక్రమంలో మాజీ జీసీసీ చైర్మన్ శోభా స్వాతిరాణి, నాలుగు మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లు, సోషల్ మీడియా ప్రతినిధులు, వైఎస్సార్‌సీపీ అనుబంధ విభాగాల నాయకులు, వేలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతం కావడంతో వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపించింది.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
