మన భారత్, కరీంనగర్:
వరంగల్–కరీంనగర్ పట్టణాలను జంట నగరాలుగా అభివృద్ధి చేసి దేశానికే ఆదర్శంగా నిలిపే లక్ష్యంతో తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి బృహత్ ప్రణాళికను ప్రకటించారు. వరంగల్, కరీంనగర్ పట్టణాలకు ఔటర్ రింగ్ రోడ్లను పూర్తి చేయడంతో పాటు, రెండింటిని అనుసంధానం చేస్తూ రహదారులను విస్తరించనున్నట్లు సీఎం వెల్లడించారు.
కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని గుమ్లాపూర్‌లో నిర్వహించిన “ప్రజాపాలన – ప్రగతి బాట” కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చొప్పదండిలో రూ.45.15 కోట్ల వ్యయంతో నిర్మించనున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ATC) కు, అలాగే గంగాధర మండలంలో రూ.5 కోట్లతో నిర్మించనున్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సీఎం శంకుస్థాపన చేశారు.
అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ, వరంగల్‌కు ఔటర్ రింగ్ రోడ్‌తో పాటు విమానాశ్రయాన్ని పూర్తి చేసి, కరీంనగర్ ఔటర్ రింగ్ రోడ్డుతో అనుసంధానం చేస్తామని తెలిపారు. ఈ రెండు పట్టణాల మధ్య అతి పెద్ద డంప్ యార్డ్‌ను ఏర్పాటు చేసి, అక్కడే విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మించనున్నట్లు వెల్లడించారు.
వరంగల్–కరీంనగర్ నగరాలను ఆధునిక మౌలిక సదుపాయాలతో తీర్చిదిద్ది, దేశంలోనే మోడల్ మున్సిపల్ కార్పొరేషన్లుగా అభివృద్ధి చేస్తామని సీఎం స్పష్టం చేశారు. 2027లో జరగనున్న గోదావరి పుష్కరాల సందర్భంగా ఆదిలాబాద్ బాసర నుంచి ఖమ్మం భద్రాచలం వరకు ఉన్న అన్ని దేవాలయాలను సమగ్ర ప్రణాళికలతో అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. అవసరమైతే నాలుగు నుంచి ఐదు వేల కోట్ల రూపాయలు వెచ్చించి, పుణ్యక్షేత్రాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని తెలిపారు. మధ్యలోని అటవీ ప్రాంతాల్లో ఎకోటూరిజాన్ని కూడా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.
రైతులు, విద్యార్థులు, యువత, మహిళల సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తున్నామని సీఎం తెలిపారు. వ్యవసాయం పండగ కావాలన్న లక్ష్యంతో రూ.2 లక్షల వరకు రుణమాఫీ, గిట్టుబాటు ధర, సన్నవడ్లకు బోనస్, రైతు బీమా, రైతు భరోసా వంటి పథకాల ద్వారా వ్యవసాయ రంగానికి దేశంలోనే అత్యధికంగా రూ.1.15 లక్షల కోట్లను ఖర్చు చేసినట్లు వెల్లడించారు.
గత రెండేళ్లలో 70 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని, బీసీ, ఎస్సీ హాస్టళ్ల పరిస్థితిని మెరుగుపరచేందుకు వంద యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మిస్తున్నామని తెలిపారు. సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో మెస్ చార్జీలను 40 శాతం, కాస్మెటిక్ చార్జీలను 200 శాతం పెంచినట్టు పేర్కొన్నారు.
మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని, మహిళా సంఘాలకు సున్నా వడ్డీకే రూ.27 వేల కోట్ల రుణాలు అందించామని తెలిపారు. మహిళా సంఘాలకు వెయ్యి బస్సులు, పెట్రోల్ బంకులు, వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ కేంద్రాలను కేటాయించినట్టు చెప్పారు.
ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలో సాధించిన అభివృద్ధిని శాసనసభ వేదికగా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు
ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా కరీంనగర్ శ్రీ సీతారామచంద్ర జిల్లా మహిళా సమాఖ్యకు సీఎం రూ.110.10 కోట్ల చెక్కును అందజేశారు.
