రూ. కోటి ఇస్తే 11 వేల ఓట్లు…!
చంద్వాడ్‌ను కుదిపేస్తున్న ఈవీఎం డీల్ ఆడియో క్లిప్ కలకలం
మన భారత్, ముంబై: మహారాష్ట్ర మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికలకు కేవలం కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉండగా చంద్వాడ్ నుంచి బయటకు వచ్చిన ఒక ఆడియో క్లిప్ సంచలనం రేపుతోంది. ఈవీఎం మెషీన్‌లను తారుమారుచేసి ఓట్లు పోగు చేస్తామంటూ జరిగిన డీల్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో రాజకీయ వాతావరణం తీవ్ర ఉద్రిక్తంగా మారింది.
స్వతంత్ర మేయర్ అభ్యర్థి రాకేశ్ అహిరే తాజాగా ఈ ఆడియో క్లిప్‌ను బయటపెట్టారు. శక్తి విలాస్ ధోమ్సే అనే వ్యక్తి మొబైల్ ద్వారా తనను సంప్రదించి, “రూ. కోటి ఇస్తే మీకు 11,250 ఓట్లు వేయిస్తాం” అంటూ ప్రలోభపెట్టాడని అహిరే ఆరోపించారు. ఈవీఎం మెషీన్ ఆపరేటర్‌తో మాట్లాడినట్లుగా ధోమ్సే క్లిప్‌లో పేర్కొన్నట్లు వినిపిస్తోంది.
ఆడియోలో మరొక షాకింగ్ విషయం ఏంటంటే—బీజేపీ మేయర్ అభ్యర్థి వైభవ్ బాగుల్ కు 13,642 ఓట్లు వస్తాయని ధోమ్సే ముందుగానే చెప్పడం. దీనిపై అహిరే సందేహాలు వ్యక్తం చేయగా, “ఈవీఎం ఆపరేటర్‌తో మాట్లాడాం… మా లెక్కలు కచ్చితమయ్యేలా చూసుకుంటాం” అని ధోమ్సే నమ్మకమిచ్చినట్లు క్లిప్‌లో వినిపిస్తోంది.
ఈవ్యాజ్యాల నేపథ్యంలో రాకేశ్ అహిరే పోలీసులను ఆశ్రయించి అధికారిక ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఆడియో క్లిప్ ప్రామాణికతపై దర్యాప్తు ప్రారంభించారు. ఎన్నికలకు ముందు వైరల్ అయిన ఈ సంభాషణ చంద్వాడ్ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
