టెక్నాలజీతో పాటు ముప్పు కూడా పెరుగుతోంది – ప్రత్యేక చట్టాలపై మెగాస్టార్ పిలుపు
మన భారత్, హైదరాబాద్, అక్టోబర్ 31: సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ డిజిటల్ యుగంలో డీప్‌ఫేక్ వీడియోలు సమాజానికి పెద్ద ముప్పుగా మారుతున్నాయని మెగాస్టార్ చిరంజీవి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల జీవితాలను, ప్రతిష్టలను దెబ్బతీసేలా మారిన ఈ ధోరణిపై ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
చిరంజీవి మాట్లాడుతూ — “డీప్‌ఫేక్ అనేది పెద్ద గొడ్డలిపెట్టులాంటిది. ఇది కేవలం వ్యక్తిగత సమస్య కాదు, సామాజిక ముప్పు. నేను ఇప్పటికే ఈ విషయం పోలీసుల దృష్టికి తీసుకెళ్లాను. డీజీపీ శివధర్ రెడ్డి, హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఈ అంశాన్ని ఎంతో సీరియస్‌గా తీసుకున్నారు. సీపీ స్వయంగా ఈ కేసును పర్యవేక్షిస్తున్నారు” అని తెలిపారు.
ప్రజలు ఇలాంటి సైబర్ నేరాలకు భయపడాల్సిన అవసరం లేదని చిరంజీవి స్పష్టం చేశారు. “పోలీసు వ్యవస్థ చాలా బలంగా ఉంది. ఎవరైనా డీప్‌ఫేక్ లేదా సైబర్ నేరాలకు గురైతే వెంటనే పోలీసులను సంప్రదించాలి. టెక్నాలజీ మన జీవితాన్ని సులభతరం చేస్తుంది కానీ దానితోపాటు ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయి. అందుకే ప్రత్యేక చట్టాలు తీసుకురావడం అత్యవసరం,” అని ఆయన హెచ్చరించారు.
డీప్‌ఫేక్‌పై మెగాస్టార్ చేసిన ఫిర్యాదును సీరియస్‌గా తీసుకున్నామని హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. సైబర్ నేరస్తుల మూలాలను గుర్తించేందుకు బృందాలు ఇప్పటికే కృషి చేస్తున్నాయని చెప్పారు. “ప్రజల్లో అవగాహన పెరుగుతున్నా, ఇంకా చాలామంది డిజిటల్ మోసాలకు బలవుతున్నారు. ఇన్వెస్ట్మెంట్ మోసాలు, డిజిటల్ అరెస్ట్‌లు, బ్యాంక్ మ్యూల్ అకౌంట్స్ వంటి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం,” అని సీపీ వివరించారు.
తన వ్యాఖ్యల్లో సజ్జనార్ పేర్కొన్నదేమంటే — “5 వేలు, 10 వేల కోసం కొంతమంది పిల్లలు తమ ఖాతాలను నేరగాళ్లకు ఇస్తున్నారు. దాంతో పెద్దలు కూడా కేసుల్లో ఇరుక్కుంటున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. పోలీసు, సైబర్ సెక్యూరిటీ బృందాలు 24 గంటలూ అందుబాటులో ఉంటాయి,” అని అన్నారు.
డీప్‌ఫేక్ విచారణతో పాటు మరో ఘటనపై కూడా సీపీ సజ్జనార్ స్పందించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన టాస్క్ ఫోర్స్ ఎస్సై శ్రీకాంత్ గౌడ్‌ను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఈ కేసులో నిందితులు పరారీలో ఉన్నారని, వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉప్పలపాటి సతీష్‌పై సీఐడీ, జీఎస్టీ కేసులు ఉన్నాయని కూడా వెల్లడించారు.
