భారీ వర్షం ప్రభావం… నాగర్‌కర్నూలులో నేషనల్ హైవేపై బ్రిడ్జ్ కూలిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి
మన భారత్, స్టేట్ బ్యూరో: నాగర్‌కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలం లతీపూర్ గ్రామ సమీపంలో రాత్రి కురిసిన భారీ వర్షం విధ్వంసం సృష్టించింది. హైదరాబాద్–శ్రీశైలం నేషనల్ హైవేపై డిండి వాగుపై నిర్మించిన వంతెన ఒక వైపు కూలిపోవడంతో రాకపోకలు పూర్తిగా స్థంభించిపోయాయి. వంతెన కింద నుంచి ఉధృతంగా ప్రవహించిన వాగు నీటికి వంతెన పునాదులు దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. రాత్రి వేళలో వంతెన ఒక పక్కకు వాలిపోయి కొద్దిసేపటికే రోడ్డు భాగం కూడా కొట్టుకుపోయింది. దీంతో హైదరాబాద్–శ్రీశైలం మధ్య వాహనాలు నిలిచిపోయాయి. ఘటన సమాచారం అందుకున్న వెంటనే రహదారి శాఖ, పోలీసు, ఆదాయశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా వాహనాల రాకపోకలను నిలిపివేయడంతోపాటు ప్రత్యామ్నాయ మార్గాలపై సూచనలు జారీ చేశారు. తుఫాన్ ప్రభావంతో జిల్లాలో అనేక ప్రాంతాల్లో వర్షం బీభత్సం సృష్టించగా, నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. అధికారులు ప్రజలు అవసరం తప్ప బయటకు రాకుండా జాగ్రత్తలు పాటించాలని హెచ్చరిస్తున్నారు. మరమ్మతు పనులు పూర్తయ్యే వరకు హైవేపై రాకపోకలు నిలిచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
