మన భారత్, ఆదిలాబాద్
స్కూల్ బస్సులు అన్ని భద్రతా ప్రమాణాలు పాటించాలి: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు, బస్సు డ్రైవర్లకు రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన సదస్సు
ఆదిలాబాద్, జూలై 13 (మన భారత్): విద్యార్థుల ప్రాణ భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికీ తావులేదని, పాఠశాలలు, కళాశాలలకు చెందిన ప్రతి బస్సు పూర్తి స్థాయి ఫిట్‌నెస్‌తో పాటు అన్ని భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఐపీఎస్ స్పష్టం చేశారు. విద్యార్థులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడం ప్రతి డ్రైవర్, యాజమాన్యం సామాజిక బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.
సోమవారం ఆదిలాబాద్ పట్టణంలోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (ట్రాఫిక్ పార్క్)లో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు, బస్సు డ్రైవర్లకు రోడ్డు భద్రత, విద్యార్థుల రవాణా భద్రత, ప్రమాదాల నివారణపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ముఖ్య అతిథిగా హాజరై భద్రతా నిబంధనలపై పలు కీలక సూచనలు చేశారు. సుమారు 200 మంది పాఠశాలలు, కళాశాలల యాజమాన్య ప్రతినిధులు, బస్సు డ్రైవర్లు ఈ సదస్సులో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రతి స్కూల్, కాలేజీ బస్సుకు చెల్లుబాటు అయ్యే ఫిట్‌నెస్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలని, బస్సుల్లో సీసీటీవీ కెమెరాలు, ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు, అత్యవసర నిష్క్రమణ ద్వారం (ఎమర్జెన్సీ ఎగ్జిట్) వంటి భద్రతా పరికరాలు అందుబాటులో ఉండాలని సూచించారు. విద్యార్థుల భద్రత కోసం ప్రతి బస్సులో డ్రైవర్‌తో పాటు శిక్షణ పొందిన అటెండర్‌ను తప్పనిసరిగా నియమించాలని ఆదేశించారు.
విద్యార్థులు బస్సు ఎక్కే సమయంలో, దిగే సమయంలో, ఇంటి వద్ద దింపే సమయంలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని డ్రైవర్లు, అటెండర్లకు సూచించారు. బస్సు నడిపే ప్రతి డ్రైవర్‌కు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ ఉండటంతో పాటు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రతి ఆరు నెలలకు ఒకసారి కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. సరిపడా విశ్రాంతి తీసుకున్న తర్వాతే విధులకు హాజరై వాహనాలు నడపాలని తెలిపారు.
మద్యం సేవించి వాహనాలు నడపడం తీవ్రమైన నేరమని పేర్కొన్న ఎస్పీ, డ్రంక్ అండ్ డ్రైవ్‌కు పాల్పడిన డ్రైవర్లపై మాత్రమే కాకుండా సంబంధిత పాఠశాల లేదా కళాశాల యాజమాన్యంపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమయానికి పాఠశాలకు చేరుకోవాలనే పేరుతో అతివేగంగా బస్సులు నడపడం, రాంగ్ సైడ్‌లో ప్రయాణించడం, నిర్లక్ష్యంగా ఓవర్‌టేక్ చేయడం వంటి చర్యలు ప్రాణాంతక ప్రమాదాలకు దారితీస్తాయని తెలిపారు.
రైల్వే క్రాసింగ్‌ల వద్ద ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని, గేట్లు మూసి ఉన్న సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ దాటేందుకు ప్రయత్నించవద్దని సూచించారు. ప్రయాణ సమయంలో విద్యార్థులు కిటికీల్లో నుంచి చేతులు లేదా తల బయటకు పెట్టకుండా డ్రైవర్, అటెండర్ నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.
“మీరు నడిపేది కేవలం ఒక బస్సు మాత్రమే కాదు.. అనేక కుటుంబాల ఆశలు, పిల్లల భవిష్యత్తు. ప్రతి ప్రయాణాన్ని అత్యంత బాధ్యతతో, అప్రమత్తంగా నిర్వహించాలి. విద్యార్థుల భద్రతే మొదటి ప్రాధాన్యత కావాలి” అని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి, టౌన్ సీఐలు బి. సునీల్ కుమార్, కె. నాగరాజు, ప్రణయ్ కుమార్, ట్రాఫిక్ పోలీసు అధికారులు, సిబ్బంది, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల యాజమాన్య ప్రతినిధులు, బస్సు డ్రైవర్లు పాల్గొన్నారు.
మీ గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్
ఆదిలాబాద్ జిల్లా లోని మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.
