మన భారత్ | ఆదిలాబాద్
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్
ఏపీకే ఫైల్స్, ఫేక్ లింకులు, వర్క్ ఫ్రం హోం ఆఫర్లతో మోసాలు..
ఈ వారం జిల్లాలో 19 సైబర్ ఫిర్యాదులు నమోదు
ఆదిలాబాద్ జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాల నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ సూచించారు. సాంకేతికత అభివృద్ధితో పాటు సైబర్ మోసగాళ్లు కూడా కొత్త కొత్త పద్ధతులను అవలంబిస్తూ అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా వాట్సాప్, టెలిగ్రామ్, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా జరుగుతున్న మోసాల పట్ల ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.
జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాల సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోన్ ఫ్రాడ్, ఏపీకే ఫైల్ ఫ్రాడ్, ఫేక్ లింక్ స్కామ్, బిజినెస్ ఇన్వెస్ట్‌మెంట్ మోసాలు, వర్క్ ఫ్రం హోం ఉద్యోగాల పేరుతో మోసాలు, హనీ ట్రాప్ కేసులు అధికంగా నమోదవుతున్నాయని పేర్కొన్నారు. ఈ తరహా నేరాల బారిన పడకుండా ప్రజలు ప్రతి సందేశాన్ని, ప్రతి ఆఫర్‌ను పరిశీలించి మాత్రమే స్పందించాలని సూచించారు.
తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, సందేశాలు, వాట్సాప్ లింకులు, టెలిగ్రామ్ గ్రూపుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. ముఖ్యంగా ఏపీకే ఫైళ్లను మొబైల్ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేయడం వల్ల వ్యక్తిగత సమాచారం, బ్యాంకు ఖాతా వివరాలు సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్లే ప్రమాదం ఉందన్నారు. ఒకసారి ఫోన్‌పై నియంత్రణ సాధించిన తర్వాత బ్యాంకు ఖాతాల్లోని డబ్బులను క్షణాల్లో ఖాళీ చేసే అవకాశం ఉంటుందని హెచ్చరించారు.
నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకుని ఉద్యోగాల పేరుతో మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపారు. వర్క్ ఫ్రం హోం, పార్ట్ టైం జాబ్, ఆన్‌లైన్ టాస్క్ పూర్తి చేస్తే భారీ ఆదాయం వస్తుందని చెప్పి మొదట చిన్న మొత్తాలు చెల్లించి నమ్మకం కలిగించి, తర్వాత పెద్ద మొత్తాలు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి ప్రకటనలపై నమ్మకం ఉంచే ముందు పూర్తి వివరాలు తెలుసుకోవాలని సూచించారు.
జిల్లాలో ఈ వారం నమోదైన కొన్ని సైబర్ నేరాల వివరాలను ఎస్పీ వెల్లడించారు. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ఓ మహిళ నిత్య బుక్స్ పేరిట వచ్చిన వర్క్ ఫ్రం హోం ఆఫర్ నమ్మి రూ.20 వేల వరకు కోల్పోయినట్లు తెలిపారు. మరో వ్యక్తి వాట్సాప్‌లో వచ్చిన తెలియని లింక్‌ను ఓపెన్ చేయడంతో రూ.40 వేల నగదు మోసపోయిన ఘటన చోటుచేసుకుందని చెప్పారు. టెలిగ్రామ్ ద్వారా పెట్టుబడులు పెడితే రెట్టింపు లాభాలు వస్తాయని నమ్మించి మరో వ్యక్తి వద్ద నుంచి రూ.8 వేల రూపాయలు వసూలు చేసినట్లు వెల్లడించారు.
భీంపూర్ మండలంలో ఒక వ్యక్తి వాట్సాప్ ద్వారా వచ్చిన ఏపీకే ఫైల్‌ను ఇన్‌స్టాల్ చేయడంతో అతని ఖాతా నుంచి రూ.1 లక్ష వరకు సైబర్ నేరగాళ్లు దోచుకున్నారని తెలిపారు. ఉట్నూర్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు డేటింగ్ వెబ్‌సైట్ ద్వారా హనీ ట్రాప్‌కు గురై రూ.1.40 లక్షలు మోసపోయిన ఘటన కూడా నమోదైనట్లు పేర్కొన్నారు.
జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో “ఖాకీ కిడ్స్” కార్యక్రమం ద్వారా విద్యార్థులు, యువత, గ్రామీణ ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్నామని ఎస్పీ తెలిపారు. సైబర్ మోసాలకు గురైన వెంటనే ఆలస్యం చేయకుండా 1930 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయాలని లేదా జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు. ముఖ్యంగా ఆర్థిక మోసాల విషయంలో గంటలోపు ఫిర్యాదు చేస్తే డబ్బు తిరిగి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పారు.
ప్రజల అప్రమత్తతే సైబర్ నేరాలకు ప్రధాన అడ్డుకట్ట అని, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వ్యవహరిస్తేనే ఇలాంటి మోసాలను నివారించగలమని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ స్పష్టం చేశారు.
గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
