యువతకు ఉపాధి అవకాశాలే లక్ష్యంగా పరిశ్రమల విస్తరణ
భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారనున్నాయి: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
మన భారత్, శ్రీకాకుళం:
శ్రీకాకుళం జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసి యువతకు విస్తృత స్థాయిలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. జిల్లాలోని లోలుగు మండలం వీఆర్ గూడెం గ్రామంలో ఏర్పాటు చేయనున్న ఎంఎస్ఎంఈ పార్కుకు మంగళవారం ఆయన రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్లతో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా పార్కు నిర్మాణం చేపట్టనున్న ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రులు, 30 ఎకరాల విస్తీర్ణంలో ఆధునిక సౌకర్యాలతో పారిశ్రామిక పార్కును అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఈ పార్కు ద్వారా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించనున్నాయని పేర్కొన్నారు.
కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, గతంలో శ్రీకాకుళం జిల్లాకు పరిశ్రమలు రావని చెప్పుకునే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు ఎంఎస్ఎంఈ పార్కుల ద్వారా జిల్లాలో కొత్త పారిశ్రామిక యుగానికి శ్రీకారం చుడుతున్నామని అన్నారు. సిక్కోలు అభివృద్ధి, యువత భవిష్యత్తు, స్థానిక ఉపాధి కల్పన కోసం పరిశ్రమలను తీసుకురావడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.
భోగాపురం విమానాశ్రయం ప్రారంభమైతే ఉత్తరాంధ్ర ప్రాంతానికి మహర్దశ పట్టబోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. రవాణా, పెట్టుబడులు, పర్యాటకం, పరిశ్రమల అభివృద్ధికి అది ప్రధాన కేంద్రంగా మారుతుందని పేర్కొన్నారు. చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారి అభివృద్ధితో రవాణా వ్యవస్థ మరింత మెరుగుపడి ప్రాంతీయ అభివృద్ధి వేగవంతమవుతుందని తెలిపారు.
విశాఖపట్నంలో గూగుల్ వంటి అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టడం వల్ల ప్రాంత స్వరూపమే మారిపోయిందని, పరిశ్రమలు ఏర్పడితేనే యువతకు ఉద్యోగాలు, స్థానిక ఆర్థిక వ్యవస్థకు బలం చేకూరుతుందని చెప్పారు. అభివృద్ధి చెందే ప్రాంతాల్లోనే భావితరాలకు మెరుగైన అవకాశాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి వల్లే హైదరాబాద్ హైటెక్ సిటీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందన్నారు. అదే తరహాలో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేసి ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
స్థానిక బ్రాండ్ల అభివృద్ధితో పాటు అంతర్జాతీయ ఎగుమతులను ప్రోత్సహించేలా ఈ పార్కులను రూపకల్పన చేస్తున్నామని తెలిపారు. స్వయం ఉపాధి, గ్రామీణ పారిశ్రామికాభివృద్ధి, యువత ఆర్థిక సాధికారతకు ఎంఎస్ఎంఈ రంగం కీలకంగా మారుతుందని వివరించారు.
ఎమ్మెల్యే కూన రవికుమార్ మాట్లాడుతూ, ఆముదాలవలస నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వీఆర్ గూడెం ప్రాంతంలో ప్రభుత్వ భూములను పరిరక్షించేందుకు తాము పోరాడామని, ఆ భూముల్లోనే ఇప్పుడు ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు కావడం సంతోషకరమన్నారు. ప్రజల సహకారంతో ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ విశ్వప్రసాద్, జాయింట్ కలెక్టర్ పర్మాన్ అహ్మద్ ఖాన్, ఏపీఐఐసీ అధికారులు, వివిధ శాఖల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, పారిశ్రామిక వర్గాల ప్రతినిధులు పాల్గొన్నారు.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
