మన భారత్, ఆదిలాబాద్:
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ ఆర్టీసీ)లో కొనసాగుతున్న సమ్మె నేపథ్యంలో యాజమాన్యం కఠిన హెచ్చరికలు జారీ చేసింది. సమ్మెను తక్షణమే విరమించి విధుల్లో చేరకపోతే కఠిన చర్యలు తప్పవని టీజీఎస్ ఆర్టీసీ చైర్మన్ వై. నాగిరెడ్డి స్పష్టం చేశారు.
పారిశ్రామిక వివాదాల చట్టం ప్రకారం ఒక వివాదం పరిష్కారం కోసం పెండింగ్లో ఉన్న సమయంలో సమ్మెకు దిగడం చట్టవిరుద్ధమని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో చట్టవిరుద్ధంగా సమ్మెలో పాల్గొంటున్న ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించారు.
సమ్మెలో పాల్గొనే ఉద్యోగులపై వేతన కోత విధించడం మాత్రమే కాకుండా, అవసరమైతే క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకుంటామని యాజమాన్యం తెలిపింది. ప్రజలకు రవాణా సేవలు అంతరాయం కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు.
ప్రస్తుతం జరుగుతున్న సమ్మె వల్ల సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఉద్యోగులు బాధ్యతతో వ్యవహరించాలని నాగిరెడ్డి సూచించారు. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడం ఉత్తమ మార్గమని అన్నారు.
ఇప్పటికైనా సమ్మెను విరమించి విధుల్లో చేరాలని ఉద్యోగులను యాజమాన్యం విజ్ఞప్తి చేసింది. సంస్థ అభివృద్ధి, ప్రజల సౌకర్యం దృష్ట్యా పరస్పర సహకారం అవసరమని స్పష్టం చేసింది.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
