e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Wednesday, October 14, 2026

బీఆర్‌ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు.. సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

మన భారత్, తెలంగాణ : బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపై సుప్రీం కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా కేసు విచారణను ధర్మాసనం వాయిదా వేసింది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చేపట్టిన అనర్హత ప్రక్రియపై రెండు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. అవసరమైతే ఆ తర్వాత మరో రెండు వారాల గడువు ఇస్తామని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది.

జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్‌లతో కూడిన ధర్మాసనం ముందు ఈ కేసు విచారణకు వచ్చింది. బీఆర్‌ఎస్ నుంచి ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలలో ఇప్పటికే ఏడుగురు ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ నిర్ణయం తీసుకున్నారని, మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం అవసరమని స్పీకర్ తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ కోర్టుకు తెలిపారు.

స్పీకర్‌కు ఇటీవల కంటి శస్త్ర చికిత్స జరిగిందని, ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో ఉన్నారని న్యాయవాది వివరించారు. అలాగే కొత్త అసెంబ్లీ సెక్రటరీ జనరల్ బాధ్యతలు స్వీకరించడంతో ప్రక్రియ ఆలస్యమైందని తెలిపారు. ఇప్పటివరకు తీసుకున్న నిర్ణయాలను నివేదిక రూపంలో కోర్టుకు సమర్పించినట్లు పేర్కొన్నారు. మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలపై తుది నిర్ణయం తీసుకునేందుకు నాలుగు వారాల సమయం ఇవ్వాలని ఆయన ధర్మాసనాన్ని కోరారు.

అయితే దీనిపై బీఆర్‌ఎస్ తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. గత ఏడాది నుంచే ఇదే వాదన వినిపిస్తున్నారని, గతంలో మూడు నెలల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశించినా స్పీకర్ స్పందించలేదని పాడి కౌశిక్ రెడ్డి తరఫు న్యాయవాది శేషాద్రి నాయుడు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం రెండు వారాల గడువు ఇస్తున్నామని స్పష్టం చేసింది. ఆ గడువు లోపు స్పీకర్ మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలపై తీసుకున్న నిర్ణయాన్ని కోర్టుకు తెలియజేయాలని ఆదేశించింది. అనంతరం అవసరమైతే మరో రెండు వారాల సమయం ఇవ్వవచ్చని పేర్కొంటూ తదుపరి విచారణను వాయిదా వేసింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE