🍖 దావత్లో విషాదం… మటన్ బోన్ గొంతులో ఇరుక్కుని వ్యక్తి మృతి. నూతన ఇల్లు వేడుక దుఃఖంలో ముగిసింది
మన భారత్, నాగర్‌కర్నూల్,: నూతన గృహ నిర్మాణ వేడుక ఆనందాన్ని కాసేపట్లోనే దుఃఖంలో ముంచెత్తిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా బొందలపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. బుధవారం రాత్రి గ్రామానికి చెందిన ఓ కుటుంబం మేస్త్రీల కోసం ఏర్పాటు చేసిన దావత్లో ఈ విషాదం సంభవించింది.
స్థానికుల సమాచారం ప్రకారం, మేస్త్రీలలో ఒకరైన పోలేముని లక్ష్మయ్య (45) భోజనం చేస్తూ మటన్ ముక్కలోని ఎముక గొంతులో ఇరుక్కోవడంతో ఊపిరాడక కుప్పకూలిపోయాడు. వెంటనే సహచరులు అతడిని సమీప ఆసుపత్రికి తరలించినప్పటికీ, మార్గమధ్యంలోనే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
