ఐక్యత, సోదరభావంతో గణేష్ ఉత్సవాలు నిర్వహించాలి: జిల్లా కలెక్టర్ రాజర్షి షా వాగాపూర్‌లో గణనాథుడిని దర్శించుకున్న కలెక్టర్ రాజర్షి షా, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి
ముగ్గుల పోటీల విజేతలకు బహుమతుల ప్రదానం
మన భారత్, సెప్టెంబర్21, మావల:
గణేష్ నవరాత్రి ఉత్సవాలు సమాజంలో సోదరభావం మరియు ఐక్యతను పెంపొందిస్తాయని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. మావల మండలం వాగాపూర్ గ్రామంలో ప్రతిష్టించిన శ్రీ విఘ్నేశ్వర స్వామివారి నవరాత్రి వేడుకల్లో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి తో కలిసి శనివారం రాత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, హారతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామస్థులు కలెక్టర్‌కు, మార్కెట్ చైర్మన్‌కు సాంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ.. గణేష్ ఉత్సవాలను ప్రజలంతా ఒకే తాటిపైకి వచ్చి ప్రశాంతమైన, ఆనందకర వాతావరణంలో నిర్వహించడం అభినందనీయమన్నారు. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని గ్రామంలో మట్టి వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమాలను మండపాల నిర్వాహకులు, గ్రామస్థులు పరస్పర సమన్వయంతో నిర్వహించుకోవాలని సూచించారు. పోలీస్, రెవెన్యూ మరియు ఇతర ప్రభుత్వ శాఖల నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిమజ్జన వేడుకలను శాంతియుతంగా పూర్తి చేయాలని కోరారు.
ఉత్సవాలలో భాగంగా గ్రామంలోని చిన్నారులకు నిర్వహించిన ముగ్గుల పోటీలు ఎంతగానో ఆకట్టుకున్నాయని కలెక్టర్ కొనియాడారు. ఇలాంటి సాంస్కృతిక పోటీలు పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు దోహదపడతాయన్నారు. అనంతరం పోటీల్లో విజేతలుగా నిలిచిన చిన్నారులకు కలెక్టర్ తన చేతుల మీదుగా బహుమతులను అందజేసి అభినందించారు.
ఈ వినాయక పూజా కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, స్థానిక తహసీల్దార్ వేణు, వాగాపూర్ సర్పంచ్ ఆత్రం దినేష్, కాంగ్రెస్ పార్టీ మావల మండల అధ్యక్షుడు కుదురుపాక సురేష్, ప్రముఖ నాయకులు భూపెల్లి శ్రీధర్, ఉత్సవ కమిటీ సభ్యులు, వార్డు సభ్యులు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మీ గొంటిముక్కుల ప్రసాద్, మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జ్
ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.
