మన భారత్ | ఆదిలాబాద్
ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో రూ.70 లక్షల జాబ్ ఫ్రాడ్.. నలుగురు అరెస్ట్
25 మందికి పైగా బాధితులు.. నకిలీ జాయినింగ్ లెటర్లతో భారీ మోసం – ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరిక
ఆదిలాబాద్, జూలై 27 (మన భారత్): ప్రభుత్వ ఉద్యోగాలు, వివిధ రకాల రుణాలు ఇప్పిస్తామని నమ్మించి నిరుద్యోగులు, అమాయక ప్రజల నుంచి సుమారు రూ.70 లక్షల మేర వసూలు చేసి మోసాలకు పాల్పడిన నలుగురు నిందితులను నార్నూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఐపీఎస్ వెల్లడించారు.
నార్నూర్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 46/2026 కింద ఐపీసీ సెక్షన్లు 420, 409, 467 ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా, మోసానికి పాల్పడిన నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
అరెస్ట్ అయిన నిందితులు
చహకాటి లింబారావు (45), కొత్తపల్లి (హామ్లెట్), మల్కుగూడ గ్రామపంచాయతీ, నార్నూర్ మండలం
జాడి ప్రవీణ్ కుమార్ (39), ఉట్నూర్
రామ్‌టెక్ ఉదయ్ కిరణ్, కెరమెరి
జాడి రవీందర్, భూసిమెట్ట, జైనూర్
ప్రభుత్వ ఉద్యోగినని నమ్మించి మోసం
ప్రాథమిక విచారణలో ప్రధాన నిందితుడు చహకాటి లింబారావు తాను ప్రభుత్వ ఉద్యోగి (DTO)నని తప్పుడు ప్రచారం చేసుకుంటూ, ఉన్నతాధికారులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని నమ్మబలికినట్లు పోలీసులు గుర్తించారు. ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని, వివిధ రకాల రుణాలు మంజూరు చేయిస్తామని చెప్పి ఇతర నిందితులతో కలిసి పలువురు నిరుద్యోగుల నుంచి భారీ మొత్తంలో నగదు వసూలు చేసినట్లు విచారణలో తేలింది.
బాధితులకు నకిలీ జాయినింగ్ లెటర్లు అందజేసి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయని నమ్మిస్తూ మోసం చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
25 మందికి పైగా బాధితులు
ఈ కేసులో ఫిర్యాదుదారు తోడసం గజానంద్ వద్ద నుంచి రూ.4 లక్షలు తీసుకుని నకిలీ జాయినింగ్ లెటర్ ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. అదేవిధంగా జన్నారం ప్రాంతానికి చెందిన ముగ్గురు, ఇంద్రవెల్లికి చెందిన ఇద్దరితో పాటు ఇప్పటివరకు 25 మందికి పైగా బాధితుల నుంచి సుమారు రూ.70 లక్షలు వసూలు చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.
పోలీసులు ఈ కేసులో మరిన్ని బాధితుల వివరాలను సేకరిస్తూ దర్యాప్తును కొనసాగిస్తున్నారు.
బాధితులు ముందుకు రావాలి – ఎస్పీ
ఈ మోసానికి గురైన మరెవరైనా బాధితులు ఉంటే ఎలాంటి భయాందోళనలు లేకుండా తమ సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ విజ్ఞప్తి చేశారు.
ఉద్యోగాలు, ప్రభుత్వ రుణాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు డిమాండ్ చేసే వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని సూచించారు. ఉద్యోగ నియామకాలు, రుణాల ప్రక్రియపై సంబంధిత ప్రభుత్వ శాఖల ద్వారా పూర్తి వివరాలు నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ కేసు దర్యాప్తులో నార్నూర్ ఎస్సై శ్రీ సాయి, పోలీసు సిబ్బంది కీలక పాత్ర పోషించారు.
మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ ఆదిలాబాద్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి
జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాలు వారిగా రిపోర్టర్స్ కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి
