పోలీసు సిబ్బందికి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచనలు..
వర్షాకాలంలో నదులు, వాగులు, వంకలు, బ్రిడ్జిల వద్ద అప్రమత్తంగా ఉండాలని ఆదేశం
గ్రామస్థాయిలో పోలీసు-ప్రజల సంబంధాలు మరింత బలోపేతం చేయాలి..
గంజాయి, గుడుంబా, అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా
ఆదిలాబాద్ జిల్లా, జూలై 22: ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశం ప్రతి ఒక్క పోలీసు సిబ్బందిలో ఉండాలని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ సూచించారు. ప్రజల పట్ల గౌరవం, వారి సమస్యల పట్ల బాధ్యతతో వ్యవహరిస్తూ పోలీసు శాఖకు ఉన్న కీర్తి ప్రతిష్టలను మరింత పెంచేలా విధులు నిర్వర్తించాలని తెలిపారు.
బుధవారం జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీసు సిబ్బందితో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ప్రత్యేక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా పరిధిలోని పోలీస్ స్టేషన్లు, కార్యాలయాలు, వివిధ విభాగాలకు చెందిన పోలీసు అధికారులు, సిబ్బంది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు.
ప్రజల పట్ల బాధ్యతతో వ్యవహరించాలి
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి పోలీసు సిబ్బందికి జవాబుదారీతనం, క్రమశిక్షణ, నిజాయితీ తప్పనిసరిగా ఉండాలని సూచించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో గౌరవంగా వ్యవహరించి, వారి సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని ఆదేశించారు.
ప్రజల నమ్మకాన్ని పొందే విధంగా పోలీసుల పనితీరు ఉండాలని, పోలీసు శాఖపై ప్రజలకు మరింత విశ్వాసం కలిగేలా విధులు నిర్వర్తించాలని తెలిపారు. నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని, చట్టాన్ని ఉల్లంఘించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు.
విలేజ్ పోలీస్ ఆఫీసర్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలి
గ్రామస్థాయిలో సమాచార వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు విలేజ్ పోలీస్ ఆఫీసర్ (VPO) విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని ఎస్పీ సూచించారు. ప్రతి గ్రామాన్ని క్రమం తప్పకుండా సందర్శిస్తూ పోలీసులకు, ప్రజలకు మధ్య సత్సంబంధాలను మరింత బలోపేతం చేయాలని తెలిపారు.
గ్రామాల్లో జరుగుతున్న పరిణామాలు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలు, అసాంఘిక కార్యకలాపాలపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరించి ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.
గంజాయి, గుడుంబాపై ప్రత్యేక నిఘా
జిల్లా వ్యాప్తంగా గంజాయి, గుడుంబా వంటి అక్రమ కార్యకలాపాలు లేకుండా నిరంతరం పర్యవేక్షించాలని ఎస్పీ ఆదేశించారు. అసాంఘిక, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
రాత్రి వేళల్లో గస్తీని మరింత పెంచి ఆర్థిక నేరాలు, చోరీలు, ఇతర నేరాలను నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలిపారు. మండలాల వారీగా ఓపెన్ డ్రింకింగ్‌పై నిఘా పెట్టడంతో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు.
రౌడీషీటర్లు, అనుమానితులపై నిరంతర నిఘా
రౌడీషీటర్లు, సస్పెక్ట్ షీటర్లు, హిస్టరీ షీటర్లపై నిరంతరం నిఘా ఉంచాలని జిల్లా ఎస్పీ సూచించారు. వారు తిరిగి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకుండా వారి కదలికలను పర్యవేక్షించాలని తెలిపారు.
అదేవిధంగా నేర చరిత్ర కలిగిన వ్యక్తులపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ముందస్తు సమాచార వ్యవస్థను బలోపేతం చేయాలని పోలీసు అధికారులకు సూచించారు.
వర్షాకాలంలో ప్రత్యేక అప్రమత్తత అవసరం
ప్రస్తుతం వర్షాకాలం కొనసాగుతున్న నేపథ్యంలో నదులు, వాగులు, వంకలు, చెరువులు, బ్రిడ్జిల వద్ద ప్రత్యేక అప్రమత్తత పాటించాలని ఎస్పీ ఆదేశించారు. వరదలు లేదా భారీ వర్షాల సమయంలో ప్రమాదకర ప్రాంతాలపై నిఘా ఉంచి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.
ప్రజలు ప్రమాదకరంగా ప్రవహించే వాగులు, నదులు దాటకుండా అవగాహన కల్పించాలని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా సిబ్బంది సిద్ధంగా ఉండాలని తెలిపారు.
రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు
రాబోయే ఆరు నెలల్లో రోడ్డు ప్రమాదాలను మరింత తగ్గించేలా సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎస్పీ సూచించారు. జాతీయ రహదారులపై ముఖ్యంగా రోడ్డుపక్కన ఉన్న దాబాల వద్ద వాహనాలు ఇష్టారాజ్యంగా పార్కింగ్ చేయకుండా కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై చర్యలు తీసుకోవడంతో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను విస్తృతంగా నిర్వహించాలని తెలిపారు. ప్రమాదాలకు కారణమయ్యే ప్రాంతాలను గుర్తించి ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.
యూనిఫామ్ పోలీసు గౌరవానికి ప్రతీక
పోలీసు యూనిఫామ్‌కు ఎంతో గౌరవం ఉందని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ప్రతి పోలీసు సిబ్బంది చక్కటి యూనిఫామ్ ధరించి, క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని సూచించారు. యూనిఫామ్ పోలీసు శాఖ గౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు.
అదేవిధంగా సిబ్బందిపై పని ఒత్తిడి తగ్గించేందుకు వీలైనంత వరకు వారానికి ఒక రోజు వీక్లీ ఆఫ్ అందించేలా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు ఎస్పీ పి. మౌనిక ఐపీఎస్, ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే ఐపీఎస్, డీఎస్పీలు ఎల్. జీవన్ రెడ్డి, వెంకట నరసయ్య, కమతం ఇంద్రవర్ధన్, ఇన్‌స్పెక్టర్లు, సబ్‌ఇన్‌స్పెక్టర్లు, రిజర్వ్, సివిల్, వివిధ పోలీసు విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
మీ గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్ ఆదిలాబాద్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి
