మన భారత్ , తెలంగాణ:
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్న ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్ల భద్రత, గోప్యతను మరింత బలోపేతం చేసే దిశగా మరో కొత్త ఫీచర్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. ఈ కొత్త ఫీచర్ ద్వారా చాట్‌లో పంపిన మెసేజ్లు స్వయంచాలకంగా డిలీట్ అయ్యే విధానం అందుబాటులోకి రానుంది.

వివరాల ప్రకారం, యూజర్లు ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకుంటే, చాట్‌లోని మెసేజ్ ఓపెన్ చేసిన సమయం నుంచి 15 నిమిషాల కౌంట్‌డౌన్ ప్రారంభమవుతుంది. ఆ సమయం పూర్తయిన వెంటనే ఆ మెసేజ్ పంపిన వ్యక్తి (సెండర్) మరియు స్వీకరించిన వ్యక్తి (రిసీవర్) ఇద్దరి చాట్‌లలోనూ పూర్తిగా తొలగిపోతుంది.

అయితే, ఓపెన్ చేయని మెసేజ్లు మాత్రం 24 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. ఈ వ్యవధిలో యూజర్ మెసేజ్‌ను ఓపెన్ చేస్తేనే 15 నిమిషాల టైమర్ ప్రారంభమవుతుంది. లేదంటే 24 గంటల తర్వాత అవి ఆటోమేటిక్‌గా డిలీట్ అయ్యే అవకాశముంది.

ప్రస్తుతం ఈ ఫీచర్ డెవలప్‌మెంట్ దశలో ఉండగా, త్వరలోనే బీటా వెర్షన్‌లో పరీక్షించనున్నారు. ముఖ్యంగా OTPలు, పాస్వర్డ్లు, సున్నితమైన సమాచారం షేర్ చేసే సమయంలో ఈ ఫీచర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు.

వాట్సాప్ ఇప్పటికే డిసప్పియరింగ్ మెసేజెస్, వ్యూయ్ వన్స్ వంటి ఫీచర్లను అందిస్తున్న నేపథ్యంలో, ఈ కొత్త ఫీచర్ యూజర్ ప్రైవసీని మరింత మెరుగుపరచనుంది.
