రెండో దశ పనులపై స్పష్టత కోరుతూ లేఖ
మన భారత్, తెలంగాణ:
హైదరాబాద్ మెట్రో రెండో దశ పనుల పురోగతిపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. నగరంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు మెట్రో రెండో దశ నిర్మాణం అత్యంత కీలకమని లేఖలో ఆయన పేర్కొన్నారు.
హైదరాబాద్ నగరంలో మెట్రో రెండో దశ పనులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరిందని గుర్తు చేసిన కిషన్‌రెడ్డి, ఇప్పటికే అమలులో ఉన్న మెట్రో మొదటి దశను ఎల్ అండ్ టీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుని తామే నిర్వహిస్తామని ప్రకటించిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో తాను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌ను కలిసి మెట్రో రెండో దశ నిర్మాణంపై చర్చించినట్లు వివరించారు.
లావాదేవీలు పూర్తి చేయాలి..
ముందుగా మెట్రో మొదటి దశను ఎల్ అండ్ టీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా టేకోవర్ చేసుకోవాలని, ఇందుకు సంబంధించిన అన్ని ఒప్పందాలు, నిర్ణయాలు, లావాదేవీలు పూర్తి చేయాల్సి ఉంటుందని కిషన్‌రెడ్డి సూచించారు. ఆ ప్రక్రియ పూర్తైన అనంతరం మెట్రో రెండో దశ నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపడుతుందని తెలిపారు.
హైదరాబాద్ మెట్రో రెండో దశ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అంగీకరించిన విషయాన్ని కేంద్రమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ స్పష్టం చేశారని కిషన్‌రెడ్డి లేఖలో పేర్కొన్నారు. మెట్రో మొదటి దశను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం, రెండో దశకు సన్నాహాల కోసం కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సంయుక్త కమిటీ ఏర్పాటు చేయాలని సీఎంతో చర్చించి నిర్ణయించామని కూడా ఆయన వెల్లడించారు.
అధికారుల పేర్లను పంపించాలి..
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇద్దరు, కేంద్ర ప్రభుత్వం తరఫున మరో ఇద్దరు అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు అధికారుల పేర్లు పంపాలని కోరినా, ఇప్పటివరకు ఎందుకు ప్రతిపాదించలేదని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు.
కావున సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే ఇద్దరు అధికారుల పేర్లను పంపించి, కమిటీ సమావేశం నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే, వేగవంతంగా ఎల్ అండ్ టీ నుంచి మెట్రో నెట్‌వర్క్‌ను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుని, అనంతరం మెట్రో రెండో దశ నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపాలని విజ్ఞప్తి చేశారు. వీలైనంత త్వరగా పనులు ప్రారంభించి పూర్తి చేయాలని కిషన్‌రెడ్డి కోరారు.
