ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరే కొనసాగించాలి: సిపిఎం ధర్నా
మన భారత్, నాగర్ కర్నూల్: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి జి రామ్ జి పేరు పెట్టడాన్ని నిరసిస్తూ, ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరు కొనసాగించాలని డిమాండ్ చేస్తూ నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి పొదిలి రామయ్య మాట్లాడుతూ, గ్రామీణ పేదలకు ఉపాధి హామీ కల్పించిన చారిత్రక పథకానికి మహాత్మా గాంధీ పేరు తొలగించడం అనుచితమని అన్నారు. ఈ పథకం కోట్లాది గ్రామీణ కార్మికులకు జీవనాధారంగా మారిందని, గాంధీజీ ఆలోచనలకు ప్రతీకగా నిలిచిన ఉపాధి హామీ పథకానికి ఇతర పేర్లు పెట్టడం ప్రజాభిప్రాయానికి విరుద్ధమని స్పష్టం చేశారు.
పథకానికి సంబంధించిన పేర్ల మార్పులు ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నమని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని, మహాత్మా గాంధీ పేరు కొనసాగించాలని డిమాండ్ చేశారు. గ్రామీణ కార్మికుల హక్కులను కాపాడే బాధ్యత ప్రభుత్వాలదేనని ఆయన గుర్తు చేశారు.
ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు మధు, నాయకులు వెంకటేష్, మల్లికార్జున్ తదితరులు పాల్గొని ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉపాధి హామీ పథకంపై ఎలాంటి మార్పులు చేసినా ప్రజల అభిప్రాయం తీసుకోవాలని వారు కోరారు.
