డబ్బుకోసమే పైరసీ… ఇక మళ్లీ ఆ దారి పట్టను’: పోలీసుల ఎదుట నోరు విప్పిన ఐబొమ్మ రవి
మన భారత్ , హైదరాబాద్ : పలువురి తలపట్టుకునేలా చేసిన పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు *ఇమంది రవి పోలీసుల కస్టడీలో కీలక ఒప్పుకోలు చేసినట్లు సమాచారం. రెండవ రోజు విచారణలో ఆయన మొదట మౌనంగా ఉన్నప్పటికీ, మధ్యాహ్నానికి తన నెట్‌వర్క్, విదేశీ లింకులు, పైరసీ కార్యకలాపాల గురించి వివరించినట్టు తెలుస్తోంది.
“విదేశీ పౌరసత్వం ఉంది… చట్టం నుంచి తప్పించుకుంటాననుకున్నా”
విచారణలో రవి, విదేశీ పౌరసత్వం ఉండటంతో తనను పట్టుకోవడం కష్టమని భావించానని ఒప్పుకున్నాడు. పైరసీ బహిర్గతమైనా, చట్టపరమైన శిక్షలను తప్పించుకోవచ్చనే అహంకారంతో కార్యకలాపాలు కొనసాగించినట్టు పేర్కొన్నాడు.
ఆరేళ్లుగా ఎవరు పట్టుకోకపోవడంతో నెట్‌వర్క్ విస్తరణ
“ఇన్ని ఏళ్లుగా ఎవరూ నా దగ్గరకు రాలేదు. అందుకే నెట్‌వర్క్‌ను దేశ, విదేశాల్లో పటిష్టం చేశాను” అని రవి వెల్లడించినట్టు సమాచారం. టెక్నికల్ టీమ్, కంటెంట్ సప్లయర్లు, రాబడి మార్గాలు గురించి పోలీసులు విపులంగా ప్రశ్నించగా, ఎక్కువ వివరాలు రవి వెల్లడించినట్టు తెలుస్తోంది.
“డబ్బు కోసమే చేశా… ఇకపై చేయను”
“మొదట్లో డబ్బు సంపాదించాలనే ఉద్దేశ్యంతో పైరసీ వైపు వెళ్లాను. చేస్తున్నది ఎంత పెద్ద తప్పో అర్థం కాలేదు. జైలు నుంచి విడుదలైన తర్వాత మళ్లీ పైరసీ దారి పట్టను” అని రవి పశ్చాత్తాపం వ్యక్తం చేసినట్టు పోలీసులు చెబుతున్నారు.
పోలీసుల దృష్టి: దేశ–విదేశీ ఏజెంట్లపై
ఈ కేసు నేపధ్యంలో రవికి సంబంధించిన సర్వర్‌లు, విదేశీ ట్రాన్సాక్షన్లు, ఏజెంట్లు, ఉద్యోగులు, టెక్నికల్ సపోర్ట్ వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. పైరసీ నెట్‌వర్క్‌కు పూర్తి స్ట్రక్చర్ సిద్ధం చేయాలని సైబర్ క్రైమ్ అధికారులు ప్రయత్నిస్తున్నారు.
ఈ విచారణతో గత కొన్నేళ్లుగా చిత్ర పరిశ్రమకు కోటీశాతం నష్టం కలిగించిన పైరసీ ర్యాకెట్‌పై మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.
