సీసీఐ నిబంధనలతో రైతులకు ఇబ్బందులు
మన భారత్, నాగర్ కర్నూల్: జిల్లాలో పత్తి కొనుగోళ్లలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) అమలు చేస్తున్న విధానాలు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని సామాజిక ఉద్యమకారుడు వావిలాల రాజశేఖర్ శర్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరానికి కేవలం 7 క్వింటాళ్ల పత్తినే కొనుగోలు చేస్తామని సీసీఐ విధించిన షరతు అన్నదాతలకు కొత్త సమస్యగా మారిందన్నారు.
కపాస్ కిసాన్ యాప్లో కొనుగోలు వివరాలు నమోదు చేసే ప్రక్రియ అత్యంత క్లిష్టంగా మారిందని, గ్రామీణ రైతులకు ఇది సాంకేతిక భారమైందని ఆయన పేర్కొన్నారు. మిగతా పత్తిని ఎక్కడ అమ్ముకోవాలో తెలియక రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడుతున్నారని వెల్లడించారు.
రైతుల సమస్యలను అర్థం చేసుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే జోక్యం చేసుకుని సీసీఐ విధానాలను రైతులకు అనుకూలంగా మార్చాలని వావిలాల రాజశేఖర్ శర్మ కోరారు. వ్యవసాయం రక్షించాలంటే కొనుగోలు విధానాలు కూడా రైతు బారిన మారాలని సూచించారు.
