ఎన్నికల్లో ఏదో తప్పు జరిగిందే… రిగ్గింగ్ అనుమానం కానీ ఆధారాలు లేవు: ప్రశాంత్ కిషోర్
బిహార్ అసెంబ్లీ ఫలితాలపై JSP నేత వ్యాఖ్యలు చర్చనీయాంశం
మన భారత్, బిహార్: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పొందిన నేపథ్యంలో జన్ సురాజ్ పార్టీ (JSP) అధినేత ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రౌండ్లో ప్రజల స్పందన, ఫీడ్బ్యాక్ ప్రకారం ఫలితాలు పూర్తిగా విభిన్నంగా వచ్చాయని పేర్కొన్న ఆయన, ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందనే అనుమానం ఉన్నప్పటికీ దాన్ని నిరూపించే స్పష్టమైన ఆధారాలు లేవని తెలిపారు.
బిహార్లో మొత్తం 243 స్థానాల్లో 238 స్థానాలకు JSP పోటీ చేసినా ఒక్క సీటు కూడా గెలవలేదు. పార్టీ ఓటు శాతం 2–3% మధ్యనే నిలిచిపోయింది. ఎన్నికల్లో ఇంత తక్కువ ఓటు శాతం రావడం ఆశ్చర్యకరమని ప్రశాంత్ కిషోర్ తెలిపారు. “గ్రౌండ్ రియాలిటీకి ఫలితాలు దగ్గరగా లేవు. స్పష్టంగా ఏదో తప్పు జరిగిందని అనిపిస్తోంది” అని ఆయన వ్యాఖ్యానించారు.
తమ పార్టీపై ప్రజల్లో మంచి స్పందన ఉన్నప్పటికీ, ఎన్నికల ప్రక్రియలో కొన్ని అనుమానాస్పద పరిణామాలు జరిగి ఉండవచ్చని చెప్పారు. అయితే, రిగ్గింగ్ జరిగిందని ఆరోపించడానికి అవసరమైన ధృవీకరణ, పక్కా సాక్ష్యాలు మాత్రం లేవని స్పష్టం చేశారు.
JSP పరాజయం నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు బిహార్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తున్నాయి.
