విశ్వప్రేమకు ప్రతిరూపం సత్యసాయి: పుట్టపర్తిలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రశంస
మన భారత్, పుట్టపర్తి: శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్న పుట్టపర్తిలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పాల్గొన్నారు. అనంతరం ఆమె సత్యసాయి మహాసమాధిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. సత్యసాయి బోధనలు, సేవా కార్యక్రమాలపై రాష్ట్రపతి విశేషంగా ప్రశంసల వర్షం కురిపించారు.
“సత్యసాయి మహాసమాధి దర్శనం నాకు అదృష్టం”
భక్తి, సేవ, విశ్వసమానత్వం పాఠాలను ప్రపంచానికి అందించిన మహనీయుడు సత్యసాయి అని పేర్కొంటూ,
“సత్యసాయి మహాసమాధిని దర్శించుకోవడం నా జీవితంలో గొప్ప అదృష్టం” అని రాష్ట్రపతి అన్నారు.
విశ్వప్రేమకు ఓ సంకేతం సత్యసాయి జీవితం
“సత్యసాయి జీవితమంతా విశ్వప్రేమకు ప్రతిరూపం. ఆయన బోధనలు లక్షల మందికి మార్గదర్శకం అయ్యాయి. కోట్లాది భక్తులు ఆయన సందేశంతో మానవ సేవలో నిమగ్నమవుతున్నారు” అని ముర్ము పేర్కొన్నారు.
వైద్యసేవల్లో సత్యసాయి ట్రస్టు కీలక భూమిక
దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాసేవా సంస్థల్లో ఒకటిగా గుర్తింపు పొందిన శ్రీ సత్యసాయి ట్రస్టు వేలాది మంది రోగులకు నిస్వార్థంగా వైద్యసేవలు అందించిందని రాష్ట్రపతి కొనియాడారు.
“ఈ ట్రస్టుకు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను” అని ఆమె అన్నారు.
సత్యసాయి 100 ఏళ్ల జయంతి ఉత్సవాలకు విశిష్టత
పుట్టపర్తి శత జయంతి వేడుకల్లో దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చి పాల్గొంటున్న వేళ, రాష్ట్రపతి సందర్శనతో ఉత్సవాలకు మరింత ప్రత్యేకత చేకూరింది.
