iBOMMA రవి విచారణలో సంచలనాలు… క్రిప్టో పేమెంట్లు, కరీబియన్ ఆఫీసు, 20 మందితో ఆపరేషన్స్
మన భారత్, హైదరాబాద్: పిరేటెడ్ సినిమాల ప్రసారం కేసులో అరెస్ట్ అయిన iBOMMA రవి విచారణ రెండో రోజు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సైబర్ క్రైమ్ పోలీసులు రవి కార్యకలాపాలపై లోతుగా దర్యాప్తు చేయగా, పలు అంతర్జాతీయ లింకులు బయటపడ్డాయి.
విచారణలో రవి తమిళ, హిందీ వెబ్‌సైట్ల నుంచి సినిమాలు నేరుగా కొనుగోలు చేసినట్లు, ఆ కొనుగోలులకు క్రిప్టోకరెన్సీ ద్వారా పేమెంట్ చేసినట్లు అధికారులు నిర్ధారించారు. పిరేటెడ్ సినిమాల ట్రాఫిక్‌ను ఆకర్షించేందుకు iBOMMA వెబ్‌సైట్‌ను ఉపయోగించి, అదే ప్లాట్‌ఫాం ద్వారా బెట్టింగ్ యాప్‌లకు గేట్వేలా పనిచేయించి భారీగా డబ్బులు సంపాదించినట్టు తెలుస్తోంది.
ఆర్థిక లావాదేవీలను దాచిపెట్టేందుకు రవి కరీబియన్ దీవుల్లో ప్రత్యేక ఆఫీసు ఏర్పాటు చేసి, అక్కడి నుంచి సుమారు 20 మంది సిబ్బందితో కంటెంట్ అప్లోడ్‌లు, సర్వర్ నిర్వహణ, వెబ్‌సైట్ అప్‌డేట్స్ జరిపినట్లు దర్యాప్తులో తేలింది.
అంతర్జాతీయ లింకులు, క్రిప్టో ట్రాన్సాక్షన్లు, బెట్టింగ్ నెట్‌వర్క్‌ల అనుసంధానంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ కేసు దేశవ్యాప్తంగా ఉన్న పైరసీ నెట్‌వర్క్‌లను బయటపెట్టే అవకాశముందని విచారణ వర్గాలు భావిస్తున్నాయి.
