మన భారత్, ఆదిలాబాద్:
తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు సరైన రాజకీయ ప్రాధాన్యత ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ అణచివేత ధోరణితో వ్యవహరిస్తోందని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ఆరెల్లి మల్లేష్ మాదిగ తీవ్రంగా విమర్శించారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు.

తెలంగాణలో మెజార్టీ గా ఉన్న మాదిగ సమాజాన్ని రాజకీయంగా అణచివేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా ఎమ్మెల్యే టికెట్ల కేటాయింపులో మాదిగలకు అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత శాసనమండలి (ఎంఎల్సీ) గా ఇచ్చిన ఐదు స్థానాల్లో ఒక్కటి కూడా మాదిగలకు కేటాయించలేదని అన్నారు.

అలాగే పెద్దపల్లి, వరంగల్, నాగర్ కర్నూల్ వంటి ఎంపీ స్థానాల్లో కూడా మాదిగలకు అవకాశం ఇవ్వలేదని విమర్శించారు. ఇటీవల భర్తీ చేసిన నాలుగు రాజ్యసభ స్థానాల్లో కూడా మాదిగలకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం బాధాకరమన్నారు.
ఎస్సీ వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన నేపథ్యంలో వర్గీకరణ అమలు చేస్తామని శాసనసభ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినప్పటికీ, తాజాగా భర్తీ చేసిన సుమారు 70 వేల ఉద్యోగాల్లో వర్గీకరణ అమలు చేయలేదని ఆరోపించారు. దీంతో మాదిగ నిరుద్యోగుల ఆశలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు.

దళితులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో కోదాడకు చెందిన కర్ల రాజేష్ అనే మాదిగ యువకుడు లాకప్ డెత్ కు గురైన ఘటనలో సంబంధిత ఎస్సై పైన కఠిన చర్యలు తీసుకోకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఉదాహరణ అని విమర్శించారు.
మాదిగల మద్దతుతోనే అనేక రాజకీయ నాయకులు ఎదిగారని గతంలో సీఎం రేవంత్ రెడ్డి అనేక వేదికలపై చెప్పారని, అయితే ఇప్పుడు అదే మాదిగలను రాజకీయంగా దూరం చేయడం నమ్మకద్రోహానికి నిదర్శనమని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఇదే విధంగా మాదిగలకు ప్రాధాన్యం ఇవ్వకుండా కొనసాగితే రాబోయే రోజుల్లో తెలంగాణలో ఆ పార్టీకి మాదిగలు గట్టి గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు బాలాజీ మాదిగ, తరువుడి శంకర్ మాదిగ, కడదారపు నవీన్ మాదిగ, చందల అశోక్ మాదిగ, కుష్ణపెళ్లి ఉమేష్ మాదిగ, రాచర్ల శరత్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.
