అయ్యప్ప స్వాములకు శుభవార్త… ఇరుముడి తో విమాన ప్రయాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్
మన భారత్, న్యూఢిల్లీ: శబరిమల యాత్రకు వెళ్లే అయ్యప్ప భక్తులకు కేంద్ర ప్రభుత్వం పెద్ద శుభవార్తను అందించింది. ఇకపై ఇరుముడి కట్టుతోనే భక్తులు విమానాల్లో ప్రయాణించేందుకు అనుమతి లభించింది. ఈరోజు నుంచే అమల్లోకి వచ్చిన ఈ నిబంధనలు జనవరి 20 వరకు కొనసాగనున్నట్లు కేంద్ర విమానయానశాఖ ప్రకటించింది.
విమానాల్లో ఇరుముడి అనుమతికి సంబంధించిన అధికారిక అనుమతులను జారీ చేసినట్టు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. శబరిమల యాత్ర సీజన్‌లో భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
“భక్తులు ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవాలి. భద్రతా నిబంధనలకు లోబడి ఇరుముడి కట్టుతో విమాన ప్రయాణం చేయవచ్చు,” అని మంత్రి స్పష్టం చేశారు. శబరిమల యాత్రకు భారీగా ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం భక్తులకు పెద్ద ఉపశమనంగా భావిస్తున్నారు.
దీంతో శబరిమల అయ్యప్పస్వామి భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
