కృష్ణా జలాల లెక్కలు అస్తవ్యస్తం… టెలిమెట్రీ స్టేషన్లకు ఏపీ సహకారం లేదు: మంత్రి ఉత్తమ్
మన భారత్, హైదరాబాద్: కృష్ణా నది జలాల వినియోగంపై స్పష్టత రావాలంటే టెలిమెట్రీ స్టేషన్ల ఏర్పాటు కీలకమని, అయితే ఆ పనిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకరించడంలేదని తెలంగాణ నీటి వనరుల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా వ్యాఖ్యానించారు. రెండు రాష్ట్రాల మధ్య నీటి వినియోగం పారదర్శకంగా ఉండటం కోసం ఇప్పటికే 18 టెలిమెట్రీ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇంకా 20 స్టేషన్లను ఏర్పాటు చేయాల్సి ఉండగా, వాటి కోసం ఏపీ ముందుకు రావడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు.
“నీటిని ఏ రాష్ట్రం ఎంత తీసుకుంటోందో తెలుసుకోవడానికి ఈ స్టేషన్లు తప్పనిసరి. ఆంధ్రప్రదేశ్ తన వాటా నిధులు ఇవ్వడం లేదు. అయినప్పటికీ ప్రజల ప్రయోజనం దృష్ట్యా ఆ నిధులనూ మేమే భరించేందుకు సిద్ధమని కేంద్రానికి చెప్పాను” అని మంత్రి ఉత్తమ్ తెలిపారు.
కృష్ణా నీటి వివాదం నేపథ్యంలో టెలిమెట్రీ స్టేషన్ల ప్రాముఖ్యత పెరిగిన ఈ సమయంలో, ఏపీ అనుసరిస్తున్న వైఖరి సమన్వయానికి ఆటంకం కలిగిస్తోందని ఉత్తమ్ విమర్శించారు.
