ఐబొమ్మ రవి కుంభకోణం… హైదరాబాదు సీపీ సంచలన వెల్లడి
మన భారత్, హైదరాబాద్: ప్రఖ్యాత పైరసీ వెబ్‌సైట్ iBOMMA వ్యవస్థాపకుడు రవి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ మీడియాతో మాట్లాడుతూ రవి గత కొన్నేళ్లుగా అంతర్జాతీయ స్థాయిలో భారీ నెట్‌వర్క్‌ను నడుపుతున్నాడని తెలిపారు. అతడు మొత్తం 110 డొమెయిన్‌లను కొనుగోలు చేసి, దాదాపు 21 వేల సినిమాలను అక్రమంగా అప్లోడ్ చేసినట్లు విచారణలో బయటపడిందని వెల్లడించారు.
సజ్జనార్ వివరాల్లో… రవి కరీబియన్ ప్రాంతంలోని సెయింట్ నేవిస్ దేశం పౌరసత్వం పొందినట్లు, తన కార్యకలాపాలను కప్పిపుచ్చేందుకు ఇండోనేషియా, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్‌లలో సర్వర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పైరసీ ద్వారా కోట్లలో సంపాదించడమే కాకుండా, iBOMMA ప్లాట్ ఫామ్‌ను ఉపయోగించి ‘వన్ విన్’, ‘వన్ ఎక్స్’ వంటి బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తున్నాడని చెప్పారు.
అంతేకాదు, రవి ప్రత్యేకంగా డిజైన్ చేసిన APK ఫైళ్ల ద్వారా ప్రజల మొబైల్ ఫోన్లలో మాల్వేర్ చొప్పించి, వ్యక్తిగత డేటా సేకరణతో పాటు ఆర్థిక మోసాలకు మార్గం సుగమం చేసినట్లు కమిషనర్ వెల్లడించారు. పలు దేశాల విభాగాలు కలిసి రవి పై దర్యాప్తును వేగవంతం చేస్తున్నాయని తెలిపారు.
ఈ కేసు బయటకు రావడంతో పైరసీ నెట్వర్క్ లపై అంతర్జాతీయ స్థాయిలో మరోసారి చర్చ మొదలైంది. సైబర్ నేరాలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని నిపుణులు సూచిస్తున్నారు.
