మైథిలీ ఠాకూర్ మరో చారిత్రాత్మక రికార్డు
మన భారత్, బిహార్: పాటలతో కోట్ల మంది హృదయాలను గెలుచుకున్న మైథిలీ ఠాకూర్… ఇప్పుడు రాజకీయ రంగంలో కూడా కొత్త చరిత్ర సృష్టించారు. బిహార్ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన అతి పిన్న వయస్కురాలిగా నిలిచిన ఆమె మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు.
భారతదేశంలో 21వ శతాబ్దంలో జన్మించి ఎమ్మెల్యే అయిన తొలి వ్యక్తిగా మైథిలీ ఠాకూర్ పేరు చరిత్రలో నిలిచిపోయింది. 2000 జూలై 25న జన్మించిన మైథిలీ, స్వతంత్ర భారత రాజకీయ చరిత్రలో కొత్త యుగాన్ని ప్రారంభించినట్టే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఇప్పటి వరకు దేశంలోని ప్రతి MLA, MP 19వ లేదా 20వ శతాబ్దాల్లో జన్మించినవారే. 21వ శతాబ్దంలో జన్మించి ప్రజాస్వామ్య పోరులో అర్హత సాధించి గెలిచిన తొలి ప్రతినిధి మైథిలీ అవడం విశేషం. అంతేకాదు
ఎటువంటి రాజకీయ నేపథ్యం లేకుండా, మొదటిసారి పోటీ చేస్తూనే ఎమ్మెల్యే గా గెలవడం ఆమె విజయానికి మరింత ప్రాధాన్యం తెచ్చిపెట్టింది. యువత రాజకీయాల్లోకే కాదు, ప్రజాసేవలో వెలుగులు నింపగలరని మైథిలీ ఠాకూర్ నిరూపించారని విశ్లేషకుల అభిప్రాయం.
ప్రజలు ఇచ్చిన ఈ అపార మద్దతు తమ బాధ్యతను మరింతగా పెంచిందని మైథిలీ తెలిపారు. తాను ప్రజల కోసం, యువత కోసం, బీహార్ అభివృద్ధి కోసం కట్టుబడి పనిచేస్తానని హామీ ఇచ్చారు.
