సర్వేలో పాల్గొన్న తాంసీ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు
మన భారత్, తాంసీ, నవంబర్ 6: ప్రభుత్వ జూనియర్ కళాశాల తాంసీ ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రత్యేక శీతాకాల శిబిరం ఆరో రోజు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వామన్ నగర్ గ్రామంలో విద్యార్థులు సామాజి ఆర్థిక సర్వే చేపట్టారు. గ్రామ ప్రజల జీవన స్థితిగతులు, ఆదాయ వనరులు, విద్యా స్థాయి, ఆరోగ్య సదుపాయాలు వంటి అంశాలపై లోతుగా అధ్యయనం చేశారు.
సర్వేలో భాగంగా కుటుంబాల వారీగా సమాచారం సేకరించి, వారి జీవన ప్రమాణాలు, వ్యవసాయం చేస్తున్నారా లేదా, కూలీగా పనిచేస్తున్నారా, పిల్లలు విద్యను కొనసాగిస్తున్నారా, ఇంట్లో మరుగుదొడ్లు ఉన్నాయా, తాగునీరు శుభ్రమైనదా, కరెంటు, పక్క ఇళ్ల సౌకర్యాలు ఉన్నాయా వంటి వివరాలు నమోదు చేశారు.
అనంతరం ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఎన్. సంతోష్ మాట్లాడుతూ.. “సామాజిక–ఆర్థిక సర్వే ద్వారా విద్యార్థులు గ్రామీణ జీవితాన్ని దగ్గరగా అర్థం చేసుకోవచ్చు. భవిష్యత్తులో మంచి పౌరులుగా మారేందుకు ఇలాంటి సేవా కార్యక్రమాలు దోహదం చేస్తాయి” అన్నారు.
ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు గ్రామ ప్రజలతో పరస్పర సంభాషణలు జరిపి, గ్రామాభివృద్ధికి తమ వంతు సహకారం అందించేందుకు ప్రతిజ్ఞ చేశారు.
