రైతులను తేమ పేరిట మోసం చేస్తున్నారని కల్వకుంట్ల కవిత ఆగ్రహం
మన భారత్, ఆదిలాబాద్, నవంబర్ 3: తెలంగాణ రాష్ట్రంలో పత్తి రైతుల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, తేమ పేరిట రైతులను దోచుకుంటున్నారని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్‌లో “జాగృతి జనం బాట” పర్యటనలో భాగంగా మాట్లాడిన ఆమె, సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని, బీజేపీ ప్రజా ప్రతినిధులను ధ్వజమెత్తారు.
“సీసీఐ కేంద్రాల్లో రైతులను తేమ పేరుతో తిరస్కరిస్తున్నారు. రైతులు పత్తి అమ్మడానికి మరే మార్గం లేక ప్రైవేట్ వ్యాపారుల వద్దకు వెళ్లి తక్కువ ధరకే అమ్ముతున్నారు. ఇది ఎంత దురదృష్టకరమో ప్రభుత్వం గ్రహించాలి,” అని కవిత పేర్కొన్నారు.
బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాష్ట్రంలో ఉన్నప్పటికీ రైతుల కోసం ఒక్క కదలిక కూడా కనిపించడం లేదని ఆమె తీవ్ర విమర్శలు గుప్పించారు. “సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ లో ప్రచార సభలు ఆపేసి, రైతుల సమస్యలపై దృష్టి సారించాలి. పత్తి తేమతో సంబంధం లేకుండా గిట్టుబాటు ధరకు సీసీఐ కొనుగోలు చేయాలి” అని డిమాండ్ చేశారు.
కవిత పర్యటనలో ఆదివాసీలు, తెలంగాణ జాగృతి నాయకులు సంప్రదాయ వాయిద్యాలు, గుస్సాడీ నృత్యాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆమె జిల్లా కేంద్రంలోని ఆదివాసీల ఆరాధ్యదైవం కొమురం భీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె ఆదివాసీల సమస్యలు, రైతుల సంక్షేమంపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
జాగృతి జనం బాట కార్యక్రమం ద్వారా కవిత ప్రజలతో నేరుగా మమేకమై, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నట్లు జాగృతి నాయకులు రంగినేని శ్రీనివాస్ తెలిపారు.
