తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలి: సీఎం రేవంత్ రెడ్డి
మన భారత్, హైదరాబాద్, నవంబర్ 1:
తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ సంస్థలు, విదేశీ ప్రతినిధులు ముందుకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం రాష్ట్ర సచివాలయంలో కెనడా హైకమిషనర్ టు ఇండియా క్రిస్టోఫర్ కూటర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసింది.
ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, ఐటీ, ఫార్మా, ఎయిర్‌స్పేస్, డిఫెన్స్, అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో తెలంగాణను పెట్టుబడులకు అనువైన గమ్యస్థానంగా తీర్చిదిద్దామని తెలిపారు. “కెనడా కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలి. స్టార్టప్స్, ఎడ్యుకేషన్, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ రంగాల్లో భాగస్వామ్యానికి విస్తారమైన అవకాశాలు ఉన్నాయి,” అని సీఎం సూచించారు.
ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు, వ్యాపార సౌలభ్యాలు, మౌలిక వసతుల అభివృద్ధిపై సీఎం కెనడా ప్రతినిధులకు వివరించారు. ఈ సమావేశంలో కెనడా మినిస్టర్ ఎడ్ జాగర్, ట్రేడ్ కమిషనర్ విక్రమ్ జైన్, కారెన్, అలాగే తెలంగాణ ప్రభుత్వ స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్, విష్ణువర్ధన్ రెడ్డి, అజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఫ్రాన్స్ ప్రతినిధులతో సీఎం రేవంత్ భేటీ తదుపరి, ఫ్రాన్స్ కాన్సుల్ జనరల్ మార్క్ లామీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం కూడా సీఎం రేవంత్‌రెడ్డిని కలిసింది. హైదరాబాద్‌లో కొనసాగుతున్న ఫ్రెంచ్ ప్రాజెక్టుల పురోగతిపై చర్చించారు. సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, “హైదరాబాద్‌లో మరిన్ని ఫ్రెంచ్ పెట్టుబడులు రావాలని ఆశిస్తున్నాం. ఫ్రాన్స్ బ్యూరో కార్యాలయాన్ని బలోపేతం చేయడం ద్వారా ద్వైపాక్షిక సహకారం మరింతగా పెరుగుతుంది,” అని అన్నారు.
ఈ సమావేశంలో మౌద్ మిక్వా, జయేష్ రంజన్, విష్ణువర్ధన్ రెడ్డి, అజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సీఎం రేవంత్‌ను కలిసిన సుదర్శన్ రెడ్డి
ఇక తాజాగా ప్రభుత్వం సలహాదారుగా నియమితులైన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి, పార్టీ వ్యవహారాలు, ముఖ్యమైన పాలనాపరమైన అంశాలపై చర్చించారు.
అదే విధంగా, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు మరియు ఇతర నేతలు కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు.
