రైతులకు గుడ్ న్యూస్… నవంబర్ 8తో వర్షాలకు గుడ్ బై – చలికాలం షురూ!
రాష్ట్రంలో చివరి వర్షాలు నవంబర్ 2 నుంచి 7 వరకు – వెదర్ మాన్ అంచనా
మన భారత్, హైదరాబాద్:
రాష్ట్రవ్యాప్తంగా గత కొద్ది వారాలుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలు రైతులకు తీవ్ర ఇబ్బందులు కలిగించాయి. పంట కోతల సీజన్‌లో కురిసిన ఈ వర్షాల వల్ల పత్తి, వరి, మక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. వరదలు, నీటి నిల్వల కారణంగా అనేక ప్రాంతాల్లో పంట నష్టం నమోదైంది. అయితే ఇప్పుడు రైతులకు ఊరట కలిగించే వార్త వచ్చింది.
వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం, నవంబర్ 2వ తేదీ నుంచి 7వ తేదీ మధ్య రాష్ట్రంలో చివరి దశ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆ తర్వాత వర్షాలకు గుడ్ బై చెప్పి రాష్ట్రం చలికాలం వైపు అడుగులు వేయనుందని అధికారులు తెలిపారు.
హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో నవంబర్ 8వ తేదీ నుండి చలికాలం ప్రారంభం అయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. ఈ కాలంలో రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోవడంతో చలి తీవ్రత పెరుగుతుందని సూచించారు.
“నవంబర్ 8 తరువాత వర్షం కురిసే అవకాశం చాలా తక్కువ. అయితే తుఫాన్ లాంటి ప్రత్యేక వాతావరణ వ్యవస్థలు ఏర్పడితేనే 2-3 రోజులపాటు వర్షాలు కురిసే అవకాశముంటుంది. లేకపోతే రాష్ట్రం మొత్తం పొడి వాతావరణం కనిపిస్తుంది” అని వెదర్ మాన్ వివరించారు.
రైతుల పంటల కోతకు అనుకూలంగా చలికాలం ప్రారంభం అవ్వడం సానుకూల పరిణామంగా భావిస్తున్నారు. ఎండలు కనిపించడం వల్ల పంట కోతలు, ఎండబెట్టే పనులు వేగవంతం అవుతాయని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.
ఇక హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల్లో నవంబర్ రెండో వారానికి చలి ప్రభావం మరింతగా ఉండే అవకాశం ఉందని అంచనా.
రైతులకు ఇది గుడ్ న్యూస్ మాత్రమే కాదు, కొత్త ఆశల సీజన్ కూడా – అని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
