జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు విప్ ఆది శ్రీనివాస్ మద్దతు – ఇంటింటా ప్రచారం జోరుగా కొనసాగింపు
మన భారత్, ముస్తాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న నవీన్ యాదవ్ గెలుపు కోసం పార్టీ శ్రేణులు బలంగా కసరత్తు ప్రారంభించాయి. ఈ క్రమంలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నేతృత్వంలో ప్రచార కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగింది.
జూబ్లీహిల్స్ ఎర్రగడ్డ డివిజన్‌కు చెందిన 71, 72 బూత్‌లకు ఇంచార్జ్‌గా ఆది శ్రీనివాస్ వ్యవహరించగా, సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ మహేందర్ రెడ్డి, ముస్తాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఏళ్ల బాల్ రెడ్డి, స్థానిక నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు డివిజన్‌లో ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసి, కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న ప్రజాక్షేమ పథకాలను వివరించారు. “ప్రజా హిత పాలనను కొనసాగించాలంటే, అభివృద్ధి కొనసాగాలంటే, నవీన్ యాదవ్ గారిని గెలిపించాలి. గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వండి” అని నాయకులు ప్రజలను కోరారు. తదుపరి సమావేశంలో ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, “జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధి కోసం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కృషి చేస్తారు. పార్టీ బలోపేతం కోసం అందరూ ఏకతాటిపై పనిచేయాలి” అన్నారు.
ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన పలు మండలాల నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రచారం సందర్భంగా ప్రజల్లో ఉత్సాహం కనిపించింది.
