మన భారత్, హైదరాబాద్: మొంథా తుఫాన్ ప్రభావం తెలుగు రాష్ట్రాలపై తీవ్రంగా చూపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలోనూ వర్షాలు విస్తృతంగా కురుస్తున్నాయి. ముఖ్యంగా మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, జర్నలిస్ట్ కాలనీ, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్‌పేట్ ప్రాంతాల్లో కుండపోత వర్షం కురవడంతో రహదారులు నీటమునిగాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, పలు చోట్ల ట్రాఫిక్ స్తంభించింది. వాహనదారులు గంటల తరబడి ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయారు.
వాతావరణశాఖ రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లు
మొంథా తుఫాన్ దక్షిణ తెలంగాణ వైపుకు కదులుతున్నందున, రాష్ట్రంలో మరికొన్ని గంటలపాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ వెల్లడించింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో రెడ్ అలర్ట్ ప్రకటించింది.
మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, కొమరం భీం, జగిత్యాల, కరీంనగర్, సిద్దిపేట్, యాదాద్రి భువనగిరి, నాగర్‌కర్నూలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
వర్షాల తీవ్రత పెరగడంతో రహదారులపై నీరు నిలిచిపోయే అవకాశం ఉన్నందున, అధికారులు ప్రజలు అవసరం తప్ప బయటకు రాకూడదని హెచ్చరిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
మొంథా తుఫాన్ ఇంకా రెండు రోజులపాటు ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. తుపాన్ దిశ మారినా, తెలంగాణలో విస్తృతంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ స్పష్టం చేసింది.
