తాంసి జూనియర్ కళాశాలలో యోగా శిక్షణ తరగతులు ప్రారంభం
మన భారత్, ఆదిలాబాద్: తాంసి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం యోగా శిక్షణ (HELP) కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. యోగా శిక్షకుడు సాయి కృష్ణ విద్యార్థులకు వివిధ యోగా ఆసనాలు చేయించి, యోగా ద్వారా కలిగే శారీరక, మానసిక లాభాలపై వివరించారు. ఆయన ప్రతిరోజూ కొద్ది నిమిషాలు యోగా చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సూచించారు.
ఈ సందర్భంగా ఎస్సై జీవన్ రెడ్డి విద్యార్థులకు డ్రగ్స్ వాడకం వల్ల కలిగే ప్రమాదాలు, సైబర్ నేరాలు, ట్రాఫిక్ నియమాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. విద్యార్థులు తమ భవిష్యత్తు కోసం శారీరక ఆరోగ్యంతో పాటు సామాజిక బాధ్యతను కూడా పాటించాలని సూచించారు.
కార్యక్రమంలో కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ ఉదయ్ భాస్కర్, ప్రవీణ్ కుమార్ బోధక సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థులు యోగా ప్రదర్శనలో ఉత్సాహంగా పాల్గొని, ఆరోగ్యకర జీవన విధానం కోసం సంకల్పం వ్యక్తం చేశారు.
